అనంతపురం అగ్రికల్చర్: గత ప్రభుత్వం కన్నా మిన్నగా రైతులను ఆదుకుంటామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలకు, చేతలకు పొంతన ఉండటం లేదు. ఎన్నో వాయిదాలు, ఎదురుచూపుల తర్వాత మూడో విడత అన్నదాత సుఖీభవ ‘పెట్టుబడి సాయం’ విడుదల చేశారు. అర్హత ఉన్నప్పటికీ ఏదో ఒక కారణం చూపుతూ ‘పీఎం కిసాన్– అన్నదాత సుఖీభవ’ జాబితా నుంచి తప్పించి చాలామందికి మొండిచేయి చూపారు. తాము అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆర్థికసాయంతో సంబంధం లేకుండా ప్రతి రైతుకూ ఏటా రూ.20 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాటపై నిలబడలేదు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇస్తామన్న రూ.20 వేల హామీని రూ.14 వేలకు కుదించారు. అది కూడా తొలి ఏడాది (2024–205) ‘అన్నదాత సుఖీభవ’ పథకం అమలు చేయకుండా జిల్లా రైతులకు రూ.400 కోట్లకు పైగా సాయం ఎగ్గొట్టేశారు. ఇక రెండో ఏడాది (2025 –2026) ఎన్నో ఒత్తిళ్లు, విమర్శల నడుమ పథకం అమలుకు శ్రీకారం చుట్టారు. జూన్‌లో వేయాల్సిన తొలివిడత సొమ్మును ఆగస్టులో జమ చేశారు. రెండో విడత నవంబరులో వేశారు. జనవరిలో ఇవ్వాల్సిన మూడో విడత సొమ్మును రెండు నెలల ఆలస్యంగా శుక్రవారం విడుదల చేశారు.
30 వేల మందికి అందని సాయం
పీఎం కిసాన్–అన్నదాత సుఖీభవ కింద గతంలో ఉన్న రైతుల సంఖ్య రకరకాల నిబంధనల పేరుతో కుదించారు. గతంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో పీఎం కిసాన్ కింద 2.85 లక్షల మందికి ఏటా రూ.6 వేలు ఇచ్చారు. అలాగే రైతు భరోసా కింద ఏటా 2.90 లక్షల మంది రైతులకు పెట్టుబడిసాయం అందిస్తూ వచ్చారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం పీఎం కిసాన్ కింద 2.58 లక్షల మందికి మాత్రమే ఇస్తూ... మిగతా 30 వేల మంది రైతులకు పంగనామాలు పెట్టింది. అలాగే సుఖీభవ కింద ఇప్పుడు 2.75 లక్షల మందికి ఇస్తూ మిగిలిన 15 వేలమందికి రిక్తహస్తం చూపించింది. ఇక అర్హుల జాబితాలో ఉన్న కొందరు రైతులకు సంబంధించి ఈ – కేవైసీ కాదని, ఎన్‌పీసీఐ యాక్టివ్‌గా లేదని, మ్యాపింగ్ చేయించుకోలేదని వ్యవసాయశాఖ కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ తిప్పుతున్నారు. కొర్రీలు వేయడం, మరికొన్ని కారణాలతో ఏటా రూ.50 కోట్ల వరకు రైతులు కోల్పోతున్న దుస్థితి కల్పించారు.
గతంలో ఠంచనుగా పెట్టుబడిసాయం
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో ఇచ్చిన హామీ మేరకు పీఎం కిసాన్–రైతు భరోసా కింద ఏటా రూ.13,500 ప్రకారం ఖరీఫ్‌కు అనుకూలంగా జూన్, రబీకి అక్టోబర్, పంటకోతలు జరిగే సంక్రాంతికి ఇలా... మూడు విడతల్లో క్రమం తప్పకుండా క్యాలెండర్ ప్రకారం పెట్టుబడిసాయం అందిస్తూ వచ్చారు. అలాగే ఐదేళ్ల కాలంలో ప్రతి రైతుకూ రూ.67,500 ప్రకారం భరోసా కల్పించారు. అలా ఐదేళ్ల కాలంలో 14.35 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఏకంగా రూ.1,937 కోట్లు పెట్టుబడిసాయం జమ చేశారు. కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా కౌలు, దేవదాయ, అటవీభూమి సాగుదారుల కింద 2 వేల మంది రైతులకు రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిస్థాయిలో రూ.13,500 ప్రకారం సాయం చేసింది.
బాబు పాలనలో అన్నీ కష్టాలే..
చంద్రబాబు ప్రభుత్వం కౌలు రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించింది. వారికి పైసా కూడా సాయం అందించలేదు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు కూడా మంజూరు చేయలేదు. దీంతో వారి కష్టాలు మరింత పెరిగిపోయాయి. అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ఇన్‌పుట్ సబ్సిడీ ఊసే లేదు, ఇన్సూరెన్స్ గల్లంతైపోయింది. సబ్సిడీ యంత్ర పరికరాలు లేవు. విత్తనాలు, ఎరువుల కష్టాలు కొనసాగుతున్నాయి. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా లేదు. పంటలకు మద్దతు ధరల గురించి ఆలోచించే పరిస్థితి లేదు. అటు వ్యవసాయం ఇటు ఉద్యానవనం రెండో సంక్షోభంలో కూరుకుపోతున్నా చంద్రబాబు సర్కారు ఆదుకునే చర్యలు చేపట్టకపోవడంతో రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది.
పీఎం కిసాన్–సుఖీభవ సొమ్ము విడుదల
అర్హుల సంఖ్య కుదింపు
పీఎం కిసాన్– అన్నదాత సుఖీభవలో వేల మందికి అన్యాయం
ప్రతి రైతుకూ ఏటా రూ.20వేలు ఇస్తామని రూ.14వేలకు తగ్గించేసిన చంద్రబాబు
తొలి ఏడాది పథకం అమలు చేయకుండా జిల్లా రైతులకు రూ.400 కోట్లకు పైగా ఎగనామం
రెండో ఏడాదిలో ‘పీఎం కిసాన్’ కింద 30 వేల మంది, ‘సుఖీభవ’ కింద 15 వేల మందికి మొండిచేయి
కౌలు రైతులకు పైసా విదల్చని సర్కారు


