
అనంతపురం: సంతానం కలగకపోవడంతో మనస్తాపం చెంది ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. కుటుంబసభ్యులు తెలిపిన మేరకు... గుంతకల్లులోని వాల్మీకి నగర్‌కు చెందిన రాజుకు ఏడేళ్ల క్రితం ఆదిలక్ష్మి (24)తో వివాహమైంది. మొబైల్ మెకానిక్‌గా జీవనం సాగిస్తున్నాడు. పెళ్లి జరిగి ఏడేళ్లైనా పిల్లలు కలగక పోవడంతో ఆదిలక్ష్మి మనోవేదనకు లోనైంది. ఈ క్రమంలో ఇరుగుపొరుగు వారు, బంధువులు అనుకునే మాటలు విని మనస్తాపం చెందిన ఆమె సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరి వేసుకుంది.
అదే సమయంలో ఇంటికి చేరుకున్న రాజు... ఉరికి వేలాడుతున్న తన భార్యను గమనించి చుట్టుపక్కల వారి సాయంతో వెంటనే కిందకు దించాడు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను హుటాహుటిన స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటనపై కసాపురం ఎస్‌ఐ దుగ్గిరాజు మాట్లాడుతూ... ఆదిలక్ష్మి కుటుంబసభ్యుల నుంచి ఎలాంటి ఫిర్యాదు తమకు అందలేదని పేర్కొన్నారు. ఎవరైనా వచ్చి ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపడతామన్నారు.