అనంతపురం: జనగణన–2027లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) మలోల, సెన్సెస్ విభాగం జాయింట్ డైరెక్టర్ జగన్నాథ్ మజ్ హి తెలిపారు. మంగళవారం జేఎన్‌టీయూ అనంతపురం ఆడిటోరియంలో జన గణనపై మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. సెన్సెస్ విభాగం జాయింట్ డైరెక్టర్ జగన్నాథ్ మజ్‌హి మాట్లాడుతూ విశ్వసనీయమైన డేటాను అందించి.. జనగణనను విజయవంతం చేయాలని కోరారు. శిక్షణలో ఎలాంటి అనుమానాలు ఉన్నా నివృత్తి చేసుకోవాలని కోరారు. డీఆర్‌ఓ మలోలా మాట్లాడుతూ ఏప్రిల్ ఒకటి నుంచి జన గణన ప్రారంభమవుతుందన్నారు. ప్రతి కుటుంబంలోని ప్రతి ఒక్కరి సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక స్థితిగతులు ఇతర వివరాల నమోదులో పొరపాట్లు జరగకుండా చూడాలన్నారు. మండల తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, ఇతర అధికారులు ఆయా స్థాయిలో ప్రణాళికలను సిద్ధం చేసుకుని కచ్చితమైన సమాచార సేకరణకు కృషి చేయాలని కోరారు. పౌరులు సైతం పక్కా సమాచారాన్ని తెలపాలని సూచించారు. కచ్చితమైన గణాంకాలే దేశాభివృద్ధికి పునాది అవుతాయన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్లు మధుసూదన, కనకరాజు, ఎస్‌ఓ గిరిధర్ తదితరులు పాల్గొన్నారు.
జాతీయస్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు సహాన ఎంపిక
కళ్యాణదుర్గం రూరల్: జాతీయస్థాయి పారా బ్యాడ్మింటన్ విభాగం పోటీలకు కళ్యాణదురం మండలం వర్లి గ్రామానికి చెందిన కురుబ సహాన ఎంపికై ంది. గత నెల 25, 26 తేదీల్లో విజయనగరంలో పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీల్లో సహన ప్రతిభ కనబరిచింది. దీంతో ఆమెను ఈ నెల ఏడో తేదీన నిర్వహించే జాతీయ పారా బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపిక చేశారు. పేద కుటుంబానికి చెందిన ఈమె క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటంతో ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్ మంగళవారం రూ.10వేల ఆర్థిక సాయం అందజేశారు.


