అనంతపురం అర్బన్: ఉపాధ్యాయలను విస్మరిస్తే ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఏపీటీఎఫ్–1938 నాయకులు ఽహెచ్చరించారు. సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టరేట్ ఎదుట ఏపీటీఎఫ్–1938 ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీనివాసరెడ్డి, శ్రీనివాసనాయక్ మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను, ఉపాధ్యాయుల సమస్యలను ఒక్కటి కూడా పరిష్కరించలేదన్నారు. 12వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయాలని, 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని, పెండింగ్ డీఏలు విడుదల చేయాలని తదితర మొత్తం 20 డిమాండ్లు ఉంచామన్నారు. వాటిని పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటసుబ్బయ్య, కార్యదర్శి మహమ్మద్‌రఫీ, పూర్వపు కార్యదర్శి కులశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.


