ప్రభుత్వ ఉదాసీనత.. వైద్యుల నిర్లక్ష్యం.. చిన్నారుల ప్రాణాల మీదకు తెస్తోంది. సకాలంలో వైద్యం అందక ఎంతోమంది మృత్యువాత పడుతున్నారు. ప్రభుత్వం మాతాశిశు మరణాల కట్టడికి చర్యలు తీసుకుంటున్నామని గొప్పలు చెప్పుకోవడం తప్ప ఆచరణలో కనిపించడం లేదు. గడిచిన ఏడాదిన్నర కాలం | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఉదాసీనత.. వైద్యుల నిర్లక్ష్యం.. చిన్నారుల ప్రాణాల మీదకు తెస్తోంది. సకాలంలో వైద్యం అందక ఎంతోమంది మృత్యువాత పడుతున్నారు. ప్రభుత్వం మాతాశిశు మరణాల కట్టడికి చర్యలు తీసుకుంటున్నామని గొప్పలు చెప్పుకోవడం తప్ప ఆచరణలో కనిపించడం లేదు. గడిచిన ఏడాదిన్నర కాలం

Mar 4 2026 7:36 AM | Updated on Mar 4 2026 7:36 AM

అనంతపురం: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ ప్రాతనిథ్యం వహిస్తున్న ఉమ్మడి అనంతపురం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ వైద్యం దయనీయంగా మారింది. అందుకు తాజా ఘటనే నిదర్శనంగా నిలుస్తోంది. బుక్కరాయసముద్రం మండలం బీజేపీ కాలనీకి చెందిన దామోదర్‌, లక్ష్మీదేవి(33) దంపతులు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు సంతానం. అయితే కుమారుడు గతంలోనే చనిపోయాడు. కొడుకు కోసం ఎదురు చూశారు. ఈ క్రమంలో లక్ష్మీదేవి నాలుగోసారి గర్భం దాల్చింది. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో క్రమం తప్పకుండా చికిత్స చేయిస్తూ వచ్చారు. పది నెలలు పూర్తవడంతో ప్రసవం నిమిత్తం ఫిబ్రవరి 27న అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో చేర్పించారు. అయితే పురిటినొప్పులు రాకపోవడంతో ఈ నెల ఒకటో తేదీన సిజేరియన్‌ చేద్దామని, అందుకు అవసరమైన రక్తం ఏర్పాట్లు చేసుకోవాలని కుటుంబ సభ్యులకు ఓ డాక్టర్‌ సూచించారు. అంతలోనే మరో డాక్టర్‌ జోక్యం చేసుకుని సిజేరియన్‌ వద్దు.. నార్మల్‌ డెలివరీ చేద్దామని సలహా ఇచ్చారు. దీంతో ఈ నెల రెండో తేదీ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి లేబర్‌ రూంలోనే ఉంచారు. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో లక్ష్మీదేవి పరిస్థితి విషమించింది. అప్పటికప్పుడు వైద్యులు సిజేరియన్‌ చేసి మగశిశువును బయటకు తీశారు. అయితే పురిట్లోనే శిశువు చనిపోయినట్లు తెలిపి కుటుంబ సభ్యులకు అందజేశారు.

ఆరోగ్య పరిస్థితిపై చెప్పేవారేరీ?

సర్వజనాస్పత్రిలో ఐదు రోజుల కిందట ప్రసవం కోసం చేర్పించామని లక్ష్మీదేవి భర్త దామోదర్‌ తెలిపారు. అప్పటి నుంచి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా పరిస్థితి చేయిదాటాక డాక్టర్లు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గర్భ సంచి కూడా తొలగించేశారని తెలిపారు. కుమారుడి కోసం ఎదురు చూసిన తమకు వైద్యుల నిర్లక్ష్యం వల్ల తీవ్ర అన్యాయం జరిగిందని విలపించారు.

మృతదేహంతో నిరసన

శిశువు మృతదేహంతో దామోదర్‌ కుటుంబ సభ్యులు మంగళవారం సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్‌ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు. శిశువు మృతికి కారణమైన వైద్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మూడు గంటల సేపు ఆందోళన చేపట్టినా.. ఎవ్వరూ పట్టించుకోలేదు. తమ బిడ్డను తమకు తెచ్చివ్వండి అంటూ కన్నీటి పర్యంతమయ్యారు.

విచారణ చేస్తాం

బిడ్డకు హార్ట్‌బీట్‌ తక్కువ కావడంతో లక్ష్మీదేవికి సీ–సెక్షన్‌ చేశాం. అయితే అప్పటికే బిడ్డ చనిపోయిందని వైద్యులు గుర్తించారు. ఈ అంశంపై విచారణ కోసం కమిటీని నియమించాం. కమిటీ నివేదిక అనంతరం వైద్యుల నిర్లక్ష్యం ఉంటే చర్యలు తీసుకుంటాం.

– డాక్టర్‌ మల్లీశ్వరి,

సూపరింటెండెంట్‌, సర్వజనాస్పత్రి

ప్రాణం పోతున్నా పట్టదా..?

ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో ఎస్‌ఎన్‌సీయూ (స్పెషల్‌ న్యూ బార్న్‌ కేర్‌ యూనిట్‌)లో పసికందులు పిట్టల్లా రాలిపోతున్నారు. తల్లికి పౌష్టికాహార లోపం, వైద్యుల అలసత్వం తదితర కారణాలతో గడిచిన ఏడాదిన్నర వ్యవధిలో దాదాపు 200 మరణాలు సంభవించాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉమ్మడి జిల్లాకు పెద్దదిక్కుగా ఉన్న సర్వజనాస్పత్రిలో మృత్యు ఘంటికలు మోగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టడంలో తాత్సారం చేస్తోంది. ఇకనైనా ప్రభుత్వం, ఉన్నతాధికారులు మేల్కొని వైద్య సేవలు మెరుగుపరచడానికి చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

వైద్యుల నిర్లక్ష్యం

ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఎస్‌ఎన్‌సీయూలో వైద్యులు పత్తా లేకుండా పోతున్నారన్న విమర్శలు ఉన్నాయి. వైద్యులు సొంత ప్రైవైట్‌ క్లినిక్‌లపైనే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ఆరోగ్యవంతమైన శిశువు అంటే 2.5 కేజీలు, ఆపై బరువు ఉండాలి. అంత కంటే తక్కువ ఉంటే శ్వాసకోశ, సెప్సిస్‌, గుండె సమస్యలతో పాటు పలు అంటురోగాలు తలెత్తుతాయి. ఎస్‌ఎన్‌సీయూలో అడ్మిషన్‌ పొందే పసికందుల్లో 50 నుంచి 60 శాతం తక్కువ బరువు, వివిధ రకాల రోగాలతో బాధపడుతున్నవారు ఉన్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తే తప్ప పరిస్థితులు మెరుగుపడేలా కనిపించడం లేదు.

ఏడాదిన్నరలో 200 మందికి పైగా చిన్నారులు మృత్యువాత

సర్వజనాస్పత్రిలో తాజాగా మరొక మరణం

గర్భసంచి తొలగింపు.. ప్రాణాపాయ స్థితిలో తల్లి

బాధ్యులపై చర్యలు తీసుకోవాలనిబాధిత కుటుంబ సభ్యుల ఆందోళన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement