బాబు సర్కార్‌పై అంగన్‌వాడీల కన్నెర్ర | - | Sakshi
Sakshi News home page

బాబు సర్కార్‌పై అంగన్‌వాడీల కన్నెర్ర

Mar 4 2026 7:36 AM | Updated on Mar 4 2026 7:36 AM

అనంతపురం అర్బన్‌: న్యాయమైన డిమాండ్ల సాధన కోసం విజయవాడలో శాంతియుతంగా చేపట్టిన ఆందోళనపై చంద్రబాబు సర్కారు ఉక్కుపాదం మోపడంపై అంగన్‌వాడీలు కన్నెర్ర చేశారు. హామీలపై ప్రశ్నించినందుకు చేతులు విరగ్గొడతారా అంటూ ప్రశ్నించారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని నినదించారు. మంగళవారం జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు, మానవహారాలు, ధర్నాలు నిర్వహించి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. అనంతపురంలో క్లాక్‌టవర్‌ వద్ద నిర్వహించిన ఆందోళనలో సీఐటీయూ, అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్ల సంఘం నాయకులు మాట్లాడుతూ విజయవాడలో ఆందోళన చేస్తున్న అంగన్‌వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అమానవీయంగా వ్యవహరించిందన్నారు. ఉదయం ఆరు గంటల సమయంలో పోలీసులను ఉసిగొలిపి అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వేతనాలు పెంచాలని, హామీలు అమలు చేయాలని కోరితే బెదరింపులకు దిగుతారా.. ఇదేనా ప్రజాస్వామ్య పాలన అంటూ ఘాటుగా ప్రశ్నించారు. అక్రమంగా అరెస్టు చేయడం ప్రభుత్వ అహంకారానికి పరాకాష్ట అంటూ మండిపడ్డారు. అక్రమ అరెస్టులను అడ్డుకునే క్రమంలో అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బేబీ రాణి చేయి విరగడం దురదృష్టకరమన్నారు. ఇది కేవలం అరెస్టు కాదని, మహిళల గౌరవాన్ని అవమానపర్చడమేనని, ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయడమేనని దుమ్మెత్తిపోశారు. ఇందుకు చంద్రబాబు ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అంగన్‌వాడీలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, గ్రాట్యుటీ, పీఎఫ్‌, ఈఎస్‌ఐ అమలు చేయాలని, ఉద్యోగ విరమణ ప్రయోజనాలు కల్పించాలని, అదనపు యాప్‌ పనిభారం తగ్గించాలని డిమాండ్‌ చేశారు. సూపర్‌వైజర్‌ పోస్టులు భర్తీ చేయాలని, ప్రతి సెక్టార్‌కూ సిబ్బంది నియామకం, సురక్షిత వసతి కల్పించాలని కోరారు. న్యాయమైన డిమాండ్లు నెరవేర్చేంత వరకు ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని కేసులు పెట్టినా ఉద్యమం ఆపేది లేదన్నారు. నిర్బంధాలకు భయపడే ప్రసక్తే లేదన్నారు. అంగన్‌వాడీల గళాన్ని అణచలేరని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్ర, జిల్లా అధ్యక్షుడు ఆర్‌వీ నాయుడు, నాయకులు గోపాల్‌, రామిరెడ్డి, నాగభూషణం, రామాంజనేయులు, ముర్తుజా, వెంకటనారాయణ, అంగన్‌వాడీ వర్కర్ల సంఘం నాయకురాళ్లు కాత్యాయని, అరుణమ్మ, సుశీల, షాహినా, ఐద్వా నాయకురాళ్లు శ్యామల, అశ్విని, అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు పాల్గొన్నారు.

హామీలపై ప్రశ్నిస్తే చేతులు విరగ్గొడతారా..

అక్రమ అరెస్టులపై జిల్లా అంతటా ఆందోళనలు

డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు పోరాడుతాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement