బిగ్‌ లూటీ! | - | Sakshi
Sakshi News home page

బిగ్‌ లూటీ!

Sep 13 2026 1:06 AM | Updated on Sep 13 2026 1:06 AM

ఏఐ ముసుగులో

సాక్షి, విశాఖపట్నం: ‘చేప పిల్లను చూపించి.. కొండముచ్చును దొంగిలించినట్లుంది’ రాష్ట్రంలో అభివృద్ధి పేరుతో చంద్రబాబు ప్రభుత్వం ఆడుతున్న నాటకం. కేవలం వెయ్యి ఉద్యోగాలనే ఎరగా చూపి, రూ.వేల కోట్ల ప్రజాధనాన్ని కార్పొరేట్‌ కంపెనీకి ధారాదత్తం చేసేందుకు సిద్ధపడింది. భీమిలి పరిధిలో 512 మెగావాట్ల ‘గ్రీన్‌ ఇంటిగ్రేటెడ్‌ ఏఐ డేటా సెంటర్‌’ కోసం హడావుడిగా తెరపైకి వచ్చిన ఓ ప్రైవేట్‌ సంస్థకు రూ.5 వేలు కోట్లకు పైగా రాయితీలను దోచిపెడుతుంది. ఈ ప్రాజెక్టు ఆమోద ప్రక్రియ అంతా ఓ పెద్ద మాయాజాలంలా సాగింది. ఒక పేరుతో ప్రతిపాదనలు పంపి, నెల రోజులకే పేరు మార్చేసిన సంస్థకు విలువైన ప్రభుత్వ భూములను ధారాదత్తం చేయడం వెనుక భారీ లాబీయింగ్‌ జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పచ్చని పల్లెల్లో సహజసిద్ధమైన వాగులు, ప్రజా రహదారులను సైతం మళ్లించేందుకు ప్రభుత్వం అధికారికంగా అనుమతులు ఇవ్వడం వెనుక పెద్ద ఎత్తున లాలూచీ ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

లూటీకి అధికారిక ఆమోదముద్ర

భీమునిపట్నం మండలం అమనాం గ్రామంలో 512 మెగావాట్ల సామర్థ్యంతో గ్రీన్‌ ఇంటిగ్రేటెడ్‌ ఏఐ డేటా సెంటర్‌ ఏర్పాటుకు ఆమోదం తెలుపుతూ ప్రభుత్వం ఆగస్టు 22న జీవో–59 జారీ చేసింది. ’ఏఎం ఏఐ ఫ్యాక్టరీ వైజాగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ ఆధ్వర్యంలో సుమారు రూ.31,387 కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్టును 28 నెలల వ్యవధిలో పూర్తి చేయాలని నిర్దేశించారు. దీనిద్వారా కేవలం 1,000 మందికి మాత్రమే ఉపాధి అవకాశాలు లభిస్తాయని, రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎస్‌ఐపీబీ) సిఫార్సుల మేరకు ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ శాఖ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

ప్రతిపాదనలకో పేరు.. ప్రాజెక్టుకో పేరు

భారీ ప్రాజెక్టుల విషయంలో పారదర్శకత వహించాల్సింది పోయి, ప్రతిపాదనల నుంచి ఆమోదం వరకు అంతా రహస్యంగా కానిచ్చేశారు. తొలుత ఈ ఏడాది జూన్‌ 23న ‘ఏఎం ఇంటెలిజెన్స్‌ ల్యాబ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ పేరుతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు వచ్చాయి. కేవలం నెల రోజుల్లోనే, అంటే జూలై 31న ‘ఏఎం ఏఐ ఫ్యాక్టరీ వైజాగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ అనే కొత్త సంస్థ తెరపైకి వచ్చింది. మాతృసంస్థకు 51 శాతం వాటా ఉందన్న కుంటిసాకుతో, రాత్రికి రాత్రే పుట్టుకొచ్చిన కొత్త సంస్థకు రూ.వేల కోట్ల రాయితీలను బదిలీ చేయడం వెనుక భారీగా ముడుపులు చేతులు మారాయనే ఆరోపణలు వస్తున్నాయి. భవిష్యత్తులో ప్రాజెక్టు నిర్మించకపోయినా, బ్యాంకుల రుణాలు ఎగ్గొట్టినా ఆ బాధ్యత కేవలం ఈ కొత్త కంపెనీకే పరిమితమయ్యేలా కుట్ర పన్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఒక్కో ఉద్యోగానికి రూ.5 కోట్ల సబ్సిడీ

రూ.31,387 కోట్ల భారీ పెట్టుబడితో ప్రాజెక్టు వస్తోందని ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వం, దీని ద్వారా వచ్చేది కేవలం 1,000 ఉద్యోగాలేనని జీవోలోనే స్పష్టం చేసింది. సాధారణంగా ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడి పెడితే కనీసం 10 వేల మందికై నా ఉపాధి దక్కాలి. కానీ, కేవలం వెయ్యి మందికి ఉద్యోగాలిచ్చే సంస్థకు ప్రభుత్వం ఏకంగా రూ.5,000 కోట్లకు పైగా పన్నుల మినహాయింపులు ఇస్తోంది. ఈ లెక్కన చూస్తే సగటున ఒక్కో ఉద్యోగానికి ప్రభుత్వం రూ.5 కోట్ల మేర ప్రజాధనాన్ని సబ్సిడీగా కట్టబెడుతోంది!

ప్రకృతి విధ్వంసానికి పచ్చజెండా

కార్పొరేట్‌ సంస్థ ప్రయోజనాల కోసం అమనాం గ్రామంలో ప్రకృతిని నాశనం చేసేందుకు సైతం వెనుకాడటం లేదు. సర్వే నంబర్లు 104/1, 101/3, 101/4, 98/2లలో ప్రవహించే సహజసిద్ధమైన వాగును, సర్వే నంబర్లు 105, 107 మీదుగా వెళ్లే ప్రజా రహదారిని సైతం మళ్లించేందుకు ప్రభుత్వం అనుమతులిచ్చింది. దీనికితోడు స్థానికులైన నిరుపేదలు ఆధారపడే డీ–పట్టా భూములతో పాటు సర్వే నంబర్లు 110, 102, 106/16ల్లోని సుమారు 6.82 ఎకరాల ప్రభుత్వ భూమిని ఏపీఐఐసీ ద్వారా ఆ సంస్థకు కట్టబెడుతున్నారు. సాధారణంగా భూ కేటాయింపుల్లో ఎకరం ధరను స్పష్టంగా పేర్కొనే ప్రభుత్వం, ఇందులో మాత్రం ‘యాక్చువల్‌ కాస్ట్‌ బేసిస్‌’ (అసలు ధర) పద్ధతి అని తెలివిగా దాటవేసింది. భోగాపురం విమానాశ్రయం సమీపంలో ఉండటంతో ఇక్కడ ఎకరం భూమి ధర రూ.8 కోట్లకు పైగా ఉంది. అంటే దాదాపు రూ.50 కోట్ల విలువైన భూమిని కేవలం రూ.5 కోట్లకే ధారాదత్తం చేస్తున్నారు.

భీమిలిలో ఏఐ డేటా సెంటర్‌ పేరుతో

అడ్డగోలు దోపిడీ

1,000 ఉద్యోగాలు ఎర చూపి

రూ.5 వేల కోట్ల రాయితీలు ధారాదత్తం

ప్రతిపాదనలు పంపిన నెల రోజులకే

రూపుమార్చుకున్న కంపెనీ

రూ.31,387 కోట్ల ప్రాజెక్టు వెనుక

భారీ లాబీయింగ్‌ అనుమానాలు

సహజసిద్ధమైన వాగులు,

దారుల విధ్వంసానికి పచ్చజెండా

రెండు దశాబ్దాల పాటు రాయితీలు

ఆర్థిక రాయితీల రూపంలో ఈ సంస్థకు ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది.

క్రాస్‌ సబ్సిడీ సర్‌చార్జి మినహాయింపు: 20 ఏళ్ల పాటు గరిష్టంగా రూ.3,000 కోట్లు

విద్యుత్‌ ట్రాన్స్‌మిషన్‌, వీలింగ్‌ చార్జీలు: రూ.1,250 కోట్లు

క్యాపిటల్‌ సబ్సిడీ (10 ఏళ్లకు): రూ.300 కోట్లు

ఎస్‌జీఎస్‌టీ రీయింబర్స్‌మెంట్‌: రూ.490 కోట్లు

ఇతర మినహాయింపులు

విద్యుత్‌ పన్ను కింద రూ.90 కోట్లు

ఫైబర్‌ యాక్సెస్‌పై రూ.30 కోట్లు

స్టాంప్‌ డ్యూటీ మినహాయింపు కింద రూ.16 కోట్లు

కేవలం 28 నెలల్లో పూర్తయ్యే ప్రాజెక్టుకు రాబోయే 20 ఏళ్ల పాటు రూ.వేల కోట్ల ప్రజాధనాన్ని ఇలా దోచిపెట్టడంపై ప్రజలు, పర్యావరణవేత్తల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement