పడిపోయిన విస్తీర్ణం
సాక్షి, అనకాపల్లి: పర్యావరణ మార్పులను తట్టుకుంటూ రైతులకు మేలు చేకూర్చేలా పలు చెరకు వంగడాలను సృష్టించిన, రాష్ట్రానికే గర్వకారణమైన పరిశోధనలు జరిపిన స్థానిక వ్యవసాయ పరిశోధన స్థానం ఇప్పుడు నిస్తేజంగా మారింది. నవీన సేద్య సాంకేతికతలు, అధునాతన వంగడాల సమాచారం, ఫలాలు చెరకు రైతులకు చేరడంలో వెనుకబడింది. వ్యవసాయ విశ్వవిద్యాలయ పాలకవర్గ పెత్తనం తదితర కారణాలతో కొత్త పరిశోధనలు ముందుకు సాగడం లేదు. వివిధ పంటలు, ముఖ్యంగా చెరకుపై పరిశోధనలు చేసి రైతులకు అండగా నిలవాల్సిన ఈ పరిశోధనా స్థానంలో ఇప్పుడు అంతా తూతూమంత్రంగా జరుగుతోంది.
22వ వంగడం విడుదల ఎప్పుడు?
1913లో ప్రారంభించిన ఈ పరిశోధనా స్థానంలో ప్రధానంగా చెరకుపైనే అధికంగా పరిశోధనలు నిర్వహిస్తున్నారు. పర్యావరణ మార్పులు, చీడపీడలను తట్టుకుని అధిక దిగుబడులు అందించేందుకు 21 నూతన వంగడాలను ఆవిష్కరించారు. ఒక్కో వంగడం ఆవిష్కరణకు కనీసం పుష్కర కాలం పట్టింది. 21 వంగడాల్లో విశ్వామిత్ర, వశిష్ట బాగా ప్రాచుర్యం పొందాయి. ఇటీవల రూపొందించిన వంగడాల్లో అశ్విని రకం రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. అయితే తర్వాత విడుదల కావాల్సిన 22వ వంగడం గురించి పట్టించుకోవడం మానేశారు.
పెద్దల ఆశీస్సులతోనే కీలక పోస్టులు
అనకాపల్లి వ్యవసాయ పరిశోధనా స్థానంలో వ్యవసాయ విశ్వవిద్యాలయ పాలకవర్గం పెత్తనం అధికమైంది. వారి ఆశీస్సులు ఉంటేనే ఇక్కడ ఉన్నత స్థానాల్లో కొనసాగే పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ రెండు కీలక పోస్టులు ఖాళీగా ఉన్నా పట్టించుకునే వారే కరవయ్యారు. తమ ఆధిపత్యం నిరూపించుకునేందుకు ఇక్కడ శాస్త్రవేత్తలను వేర్వేరు ప్రాంతాలకు బదిలీ చేయడంతో మిగిలిన శాస్త్రవేత్తలు, ఉద్యోగులు నిరాశాస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నారు.
రాష్ట్రంలో ఒకప్పుడు లక్ష హెక్టార్లలో చెరకు సాగయ్యేది. పలు కారణాలతో చెరకు సాగు విస్తీర్ణం 20వేల హెక్టార్లకు దిగజారింది. అనకాపల్లి జిల్లాలో చెరకు సాగు విస్తీర్ణం మరీ దారుణంగా రెండు వేల హెక్టార్లకు పడిపోయింది. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఒకప్పుడు 30 వేల హెక్టార్ల వరకూ సాగయ్యేది. నాలుగు చక్కెర కర్మాగారాలను మూసివేయడం, బెల్లం తయారీకి కూలీలు దొరకకపోవడం, బెల్లానికి గిట్టుబాటు ధర లేకపోవడం వంటి పలు కారణాలతో పాటు కొత్త పరిశోధనలపై దృష్టి సారించకపోవడం, చెరకు రైతుల్ని ప్రోత్సహించే వ్యవస్థలు నిర్వీర్యమవడంతో ఈ దుస్థితి ఏర్పడింది. తెగుళ్ల నుంచి పంటను కాపాడే టిష్యూకల్చర్ పరిశోధనల్ని సైతం మూలకు చేర్చినట్టు ప్రచారం సాగుతోంది.


