నర్సీపట్నం: గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వివిధ రూపాల్లో వినాయక విగ్రహా లను కొలువుదీర్చేందుకు ఉత్సవ కమిటీల సభ్యులు సిద్ధమవుతుండగా... నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధి శాంతినగర్‌కు చెందిన వాసు ఈ ఏడాది అక్షింతలతో గణపతి విగ్రహం తీర్చిదిద్దుతున్నాడు. అక్షింతలు, పసుపు కొమ్ములు, ఆవాలు, గుమ్మడి తదితర గింజలతో వినాయకుడిని తయారు చేస్తున్నాడు. 16 ఏళ్లుగా వివిధ రూపాల్లో వినాయక విగ్రహాలను తయారు చేసి, తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. ఇంటి వద్దే మండపం ఏర్పాటు చేసి, తాను తయారు చేసిన విగ్రహాన్ని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు జరిపిస్తున్నాడు. విగ్రహం తయారు చేయడానికి రూ.వేలలో ఖర్చు అవుతున్నప్పటికీ, స్వామి మీద ఉన్న మక్కువతో ప్రకృతికి హాని కలగకుండా ప్రతి ఏడాది తానే విగ్రహాలను తయారు చేస్తున్నానని వాసు పేర్కొన్నాడు.


