అనకాపల్లి టౌన్: భూముల రీసర్వేలో ఆదివాసీ రైతులకు జరుగుతున్న అన్యాయాలపై ఉన్నత స్థాయి విచారణ చేపట్టాలని న్యాయవాది పి.ఎస్.అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. పట్టణంలోని ఓ ప్రైవేట్ హాల్‌లో అనకాపల్లి, కాకినాడ జిల్లాలకు చెందిన ఆదివాసీ రైతుల సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తరతరాలుగా భూముల ను సాగు చేస్తున్నప్పటికీ రీసర్వే సమయంలో గిరిజన రైతులకు అన్యాయం జరుగుతోందన్నా రు. ఆదివాసీలు సాగులో ఉన్న భూముల వివరాలను అధికారులు నమోదు చేసుకున్నప్పటికీ వాటిని తుది రికార్డుల్లో పేర్కొనడం లేదని ఆరోపించారు. గిరిజనుల భూముల రక్షణకు ప్రత్యేక విధివిధానాలను రూపొందించాలన్నారు. అనంతరం నెహ్రుచౌక్ జంక్షన్‌లో అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బుగతా బంగారురావు, సీపీఐ జిల్లా కార్యదర్శి రాజాన దొరబాబు తదితరులు పాల్గొన్నారు.


