న్యాయ సేవా ప్రాధికార సంస్థ తీర్పులు శాశ్వతం | - | Sakshi
Sakshi News home page

న్యాయ సేవా ప్రాధికార సంస్థ తీర్పులు శాశ్వతం

Sep 13 2026 1:06 AM | Updated on Sep 13 2026 1:06 AM

విశాఖ లీగల్‌: న్యాయ సేవా ప్రాధికార సంస్థ ఇచ్చే తీర్పులు శాశ్వతమైనవని విశాఖ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.శ్రీనివాస్‌ స్పష్టం చేశారు. శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన జాతీయ మెగా లోక్‌ అదాలత్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజీమార్గం ద్వారానే వేగవంతమైన, సత్వర న్యాయం సాధ్యమవుతుందని తెలిపారు. మధ్యవర్తిత్వం ద్వారా కేసులను త్వరగా పరిష్కరించడం లోక్‌ అదాలత్‌ ప్రత్యేకత అని పేర్కొన్నారు. కక్షిదారులకు ఉత్తమ సేవలు అందించడమే లక్ష్యంగా ఈ వేదిక పనిచేస్తోందన్నారు. జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌ మాట్లాడుతూ పలు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న పన్నుల కేసులను పరిష్కరించడం ద్వారా సంస్థకు కోట్ల రూపాయల ఆదాయం లభించిందన్నారు. అదే సమయంలో వినియోగదారులకు కూడా ఉపశమనం కలిగిందని తెలిపారు. జేసీ విద్యాధరి మాట్లాడుతూ దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసుల వల్ల ఇబ్బందులు పడుతున్న వారికి లోక్‌ అదాలత్‌ ఎంతో మేలు చేకూర్చిందన్నారు. న్యాయ సేవా ప్రాధికార సంస్థ కార్యదర్శి ఆర్‌.సన్యాసినాయుడు మాట్లాడుతూ ఉమ్మడి విశాఖ జిల్లాలో 50 బెంచ్‌లను ఏర్పాటు చేసి 21 వేలకుపైగా కేసులను విచారణకు తీసుకుని పెద్ద ఎత్తున రాజీలు సాధించామన్నారు. న్యాయవాదులు, న్యాయమూర్తులు, కక్షిదారుల సమన్వయంతో కీలకమైన కేసులకూ పరిష్కారం చూపడం అభినందనీయమని పేర్కొన్నారు. విశాఖ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు నమ్మి సన్యాసిరావు మాట్లాడుతూ కక్షిదారులకు త్వరితగతిన ఫలితాలు అందేలా పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదుల సంఘం కార్యదర్శి ఒమ్మి సుధాకర్‌ యాదవ్‌, క్రీడా సాంస్కృతిక సంఘం కార్యదర్శి వేల్పుల సురేష్‌బాబు, మహిళా న్యాయవాదుల సమాఖ్య అధ్యక్షురాలు అనురాధ, బార్‌ కౌన్సిల్‌ ఉపాధ్యక్షుడు ఎస్‌. కృష్ణమోహన్‌, పూర్వ ఉపాధ్యక్షుడు కె. రామజోగేశ్వరరావు పాల్గొన్నారు.

జిల్లా కోర్టుకు పూర్వ వైభవం : కొంత కాలంగా నిస్తేజంగా ఉన్న లోక్‌ అదాలత్‌కు మళ్లీ కొత్త ఊపిరి వచ్చింది. కొత్తగా బాధ్యతలు చేపట్టిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.శ్రీనివాస్‌ ప్రత్యేక చొరవతో వ్యవస్థలో చైతన్యం నింపారు. కక్షిదారులకు తాగునీరు, భోజనం వంటి సౌకర్యాలను సమకూర్చారు. సుమారు 3,000 మందికి అన్నదానం చేశారు.

కేసుల వివరాలు : ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన మెగా లోక్‌ అదాలత్‌లో మొత్తం 12,600 కేసులు రాజీ అయ్యాయి. వీటి ద్వారా సుమారు రూ.66 కోట్లు రాజీ రుసుంగా వసూలయ్యాయి. ముఖ్యంగా 12వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి కె.రత్నకుమార్‌ ఆధ్వర్యంలో ఒక కేసులో మహిళలకు రూ.95 లక్షలు పరిహారం అందించడం విశేషంగా నిలిచింది.

విశాఖ జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్‌

మెగా లోక్‌ అదాలత్‌కు విశేష స్పందన

ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా 12,600 కేసుల రాజీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement