తాండవలో నిలిచిన చేప పిల్లల ఉత్పత్తి | - | Sakshi
Sakshi News home page

తాండవలో నిలిచిన చేప పిల్లల ఉత్పత్తి

Aug 24 2026 12:19 AM | Updated on Aug 24 2026 12:19 AM

● కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో మూతపడే స్థితికి కేంద్రం ● ఉపాధికి దూరమవుతున్న మత్స్యకారులు ● ఇతర ప్రాంతాలకు వలసలు

మత్స్యకారుల జీవన వనరు తాండవ చేప పిల్లల కేంద్రం మూలకుచేరింది. ఉమ్మడి విశాఖ జిల్లాలోనే ఏకై క చేపల విత్తన ఉత్పత్తి కేంద్రానికి గ్రహణం పట్టింది. కూటమి ప్రభుత్వ అలసత్వంతో రెండేళ్లుగా పెంపకానికి గండిపడింది. ఫలితంగా మత్స్యకారులు ఉపాధికి దూరమై అవస్థలకు గురవుతున్నారు. పలువురు వలసబాట పట్టారు.

నాతవరం: మండలంలోని తాండవ చేప పిల్లల విత్తన ఉత్పత్తి కేంద్రం కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఉనికి కోల్పోయే స్థితికి చేరింది. ప్రతి ఏటా మత్స్యశాఖ ఆధ్వర్యంలో జూన్‌ నుంచి ఆగస్టు మధ్య ఈ కేంద్రంలో సుమారు 1.50 కోట్ల చేప పిల్లలను ఉత్పత్తి చేసేవారు. ఇక్కడ పెద్ద చేపలకు కృత్రిమ గర్భోత్పత్తి (ఇంజెక్షన్ల) ద్వారా వివిధ రకాల చేప పిల్లలను ఉత్పత్తి చేసి, మొదట తాండవ రిజర్వాయర్‌లో విడుదల చేసేవారు. అనంతరం జిల్లాలోని రైవాడ, కోనాం, పెద్దేరు, కల్యాణపులోవ తదితర రిజర్వాయర్లకు సరఫరా చేసేవారు. వాటితో పాటు రిజిస్టర్‌ అయిన మత్స్యకార సహకార సంఘాలకు రాయితీపై సరఫరా చేసేవారు. మిగిలిన వాటిని నర్సీపట్నంలోని మత్స్యశాఖ కార్యాలయ ఆవరణలోని నీటి కుండీల్లో పెంచి ప్రైవేటు వ్యక్తులకు విక్రయించేవారు. అంతటి ప్రాముఖ్యత ఉన్న కేంద్రాన్ని ప్రస్తుత కూటమి ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసింది. సిబ్బంది కొరతనో లేక నిధుల లేమియో తెలియదు కానీ, రెండేళ్ల నుంచి ఇక్కడ ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేశారు.

శిథిలావస్థలో భవనాలు.. పట్టించుకోని సిబ్బంది

ఉత్పత్తి నిలిచిపోవడంతో రూ.లక్షల విలువైన యంత్రాలు, సామగ్రి నిరుపయోగంగా మారి పాడవుతున్నాయి. నీటి సరఫరా కోసం వేసిన బోరు బావి చుట్టూ పిచ్చిమొక్కలు మొలిచాయి. కార్యాలయం తలుపులు, కిటికీలకు చెదలు పట్టి ఊడిపోతున్నాయి. పర్యవేక్షణ పూర్తిగా కరవైంది. సిబ్బంది చుట్టం చూపుగా వచ్చి వెళ్తున్నారు.

ఉత్పత్తి కేంద్రాన్ని తక్షణమే పునరుద్ధరించాలి

తాండవ చేప పిల్లల విత్తన ఉత్పత్తి కేంద్రాన్ని కాపాడవలసిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యే, స్పీకర్‌ అయ్యన్నపాత్రుడుపై ఉంది. కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించి నిధులు కేటాయించి, ఉత్పత్తిని ప్రారంభించాలి. లేనిపక్షంలో మత్స్యకారుల భవిష్యత్తు కోసం రాజకీయాలకు అతీతంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం.

–బాలేపల్లి వెంకటరమణ,సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు

మత్స్యకారుల వలసలు

చేప పిల్లల ఉత్పత్తి నిలిచిపోవడంతో తాండవ రిజర్వాయర్‌లో చేపల వేట సక్రమంగా సాగడం లేదు. ఈ రిజర్వాయర్‌పై ఆధారపడి నాతవరం, గొలుగొండ, కొయ్యూరు మండలాలకు చెందిన జాలరిపేట, అమ్మపేట, జోగుంపేట, పొగచెట్లపాలెం, సారిక, మల్లవరం, ఆడాకుల, చోద్యం తదితర గ్రామాలకు చెందిన 600 నుంచి 700 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. గతంలో 5 నుంచి 25 కిలోల బరువుండే పెద్ద చేపలు పడేవని, ఇప్పుడు చిన్న చేపలు కూడా దొరకడంలేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేట సాగక ఉపాధి కరవవడంతో జాలరిపేటకు చెందిన పలువురు మత్స్యకారులు నాగార్జున సాగర్‌ వంటి ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారు. సమస్యలపై విన్నవించుకుందామంటే ఉత్పత్తి కేంద్రంలో అధికారులెవరూ అందుబాటులో ఉండటం లేదు.

కొనుగోలు చేసి తెచ్చే దుస్థితి

నాతవరంలోని తాండవ ప్రాజెక్టు దిగువన 1986లో ఈ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ సరైన వాతావరణంతో పాటు నీటి సదుపాయం సమృద్ధిగా ఉండడంతో ప్రతి ఏటా నిర్దేశించిన లక్ష్యాన్ని అధిగమించి ఉత్పత్తి సాధించేవారు. అయితే గత ఏడాది ఇక్కడ ఉత్పత్తి నిలిచిపోవడంతో ఇతర జిల్లాల నుంచి చేప పిల్లలను కొనుగోలు చేసి తీసుకురావాల్సి వచ్చింది. అలా తెచ్చిన పిల్లలనే కలెక్టర్‌ విజయకృష్ణన్‌ రిజర్వాయర్‌లో విడుదల చేశారు. స్థానికంగా కోట్లాది పిల్లలను ఉత్పత్తి చేసి జిల్లా అంతటికీ సరఫరా చేసిన కేంద్రం, నేడు బయట నుంచి కొనుగోలు చేసే స్థితికి దిగజారడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement