అనకాపల్లి టౌన్: వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి దశలవారీగా పోరాటం చేస్తామని ఏపీ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా చైర్‌పర్సన్ ఎస్.జయ తెలిపారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఈ నెల 24 నుంచి నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కానున్నట్టు చెప్పారు. పెన్‌డౌన్, కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే సెప్టెంబర్ 6 తర్వాత సమ్మెకు సిద్ధమవుతామన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, విధి నిర్వహణలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు జీతంతో కూడిన సెలవులు, పీఎఫ్, హెల్త్ కార్డు సౌకర్యం కల్పించాలని, రిక్వెస్ట్, మ్యూచువల్ ట్రాన్స్‌ఫర్లకు అవకాశం కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో సీఐ టీయూ జిల్లా అధ్యక్షుడు వి.వి. శ్రీనివాసరావు, జేఏసీ కన్వీనర్ ఐ. రాజాబాబు పాల్గొన్నారు.


