ప్రభుత్వాస్పత్రుల్లో..
మహారాణిపేట: చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పేద రోగుల ప్రాణాలకు భరోసా కరువైంది. ఒకవైపు జూనియర్ వైద్యుల సమ్మెతో సర్కారు వైద్యం పడకేసింది. మరోవైపు ప్రాణాధార మందుల కొరత పేద రోగులను నిలువునా దహిస్తోంది. ఉత్తరాంధ్ర ప్రజల పెద్ద దిక్కు అయిన కింగ్ జార్జ్ ఆస్పత్రి (కేజీహెచ్) మొదలుకొని నగరంలోని అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో మందుల కొరత తీవ్ర స్థాయికి చేరింది. రోగుల ఆర్తనాదాలు వినపడుతున్నా పాలకుల్లో మాత్రం చలనం లేకుండా పోయింది.
మందుల కోటాలో కోత
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పేద రోగులకు అన్ని రకాల మందులు పుష్కలంగా అందుబాటులో ఉండేవి. దాదాపు 613 రకాల ఔషధాలను నిరంతరం అందుబాటులో ఉంచి, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెల రోజులకు సరిపడా మందులను ఒకేసారి ఉచితంగా అందజేసేవారు. కానీ నేడు ఆ పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. ప్రస్తుతం కేవలం 318 రకాల మందులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అందులోనూ అత్యవసర ఔషధాలు దాదాపు నిండుకున్నాయి. నెల రోజుల కోటాను కాస్తా వారం రోజులకు కుదించేశారు. ఆ కొద్దిపాటి మందుల కోసమే గంటల తరబడి క్యూలైన్లలో పడిగాపులు కాయాల్సి వస్తోంది.
ప్రాణాధార మందుల కొరత
బీపీ, షుగర్, గుండెజబ్బులు, క్యాన్సర్, ఫిట్స్, మూర్ఛ వ్యాధి నివారణ మాత్రలతో పాటు ఇన్సులిన్, యాంటీబయాటిక్స్, బ్లీడింగ్ నివారణ, రక్తహీనత నివారణ మందుల నిల్వలు పూర్తిగా అడుగంటాయి. ఆక్సిజన్ పైపులు, వెంటిలేటర్ కిట్లు, ఆపరేషన్లకు వాడే సర్జికల్ దారాలు, గర్భాశయ ఇన్ఫెక్షన్ నివారణ మందులు సైతం దొరకడం లేదు. క్యాన్సర్ బాధితులకు అవసరమైన ఖరీదైన మందులు వస్తే 2–3 రోజుల్లోనే అయిపోతున్నాయి. మళ్లీ ఎప్పుడు వస్తాయో తెలియక ప్రాణాంతక వ్యాధులతో బాధపడే రోగులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఎదురుచూస్తున్నారు.
100 గ్లౌజులకు ఉన్నవి 10 మాత్రమే!
ఆస్పత్రుల్లో ప్రాథమిక వైద్య పరికరాల కొరత మరింత దారుణంగా మారింది. కేజీహెచ్‌లో రోజుకు కనీసం 100 సెట్ల గ్లౌజులు అవసరం కాగా, పది సెట్లకు మించి లభించడం లేదు. ఒక్కోసారి గ్లౌజులు లేకుండానే ఆపరేషన్లు చేయాల్సిన ప్రమాదకర పరిస్థితులు దాపురిస్తున్నాయని వైద్యులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గాయాలకు డ్రెస్సింగ్ చేయడానికి అవసరమైన సూదులు, కిట్లు, ఆయింట్‌మెంట్లు లేకపోవడంతో రోగుల కుటుంబ సభ్యులే బయట మెడికల్ స్టోర్స్‌లో కొనుగోలు చేయాల్సి వస్తోంది.
కౌంటర్లు కిటకిట.. రోగుల విలవిల!
కేజీహెచ్‌తో పాటు ప్రభుత్వ విక్టోరియా ఆస్పత్రి, ప్రాంతీయ కంటి ఆస్పత్రి, ప్రభుత్వ మానసిక వైద్యశాల, ఈఎన్‌టీ, రాణి చంద్రమతి దేవి, టీబీ, ఐడీ ఆస్పత్రుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. రోజూ 3 వేల మందికి పైగా ఓపీ, ఐపీ రోగులు మందుల కౌంటర్ల వద్ద బారులు తీరుతున్నారు. మందుల కోసం నిలబడితే ‘స్టాక్ లేదు.. విజయవాడకు ఇండెంట్ పెట్టాం.. బయట కొనుక్కోండి’ అంటూ సిబ్బంది చేతులెత్తేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రభుత్వ వైద్యం పూర్తిగా పడకేసింది. ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యం అందక.. మందులు లేక రోగులు నరకయాతన అనుభవిస్తున్నారు.
నిండుకున్న మందుల స్టాక్
613 రకాలకు
అందుబాటులో ఉన్నవి 318 మాత్రమే..
బీపీ, షుగర్, గుండె జబ్బులు,
క్యాన్సర్ మందుల కొరత
నెల రోజుల కోటా
వారం రోజులకు కుదింపు


