తప్పిన పెను ప్రమాదం
నక్కపల్లి: స్టీల్‌ప్లాంట్, బల్క్‌డ్రగ్ పార్క్ నిర్వాసితుల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కాలనీలో నిర్మాణంలో ఉన్న వాటర్ ట్యాంక్ ఆదివారం కూలిపోయింది. ట్యాంకు అడుగు భాగంలో పనిచేస్తున్న ఇద్దరు మేసీ్త్రలు తీవ్రంగా గాయపడగా, ట్యాంక్ పైభాగంలో పనిచేస్తున్న సుమారు 20 మంది సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డారు. బోదిగల్లం వద్ద నిర్వాసితుల కోసం పునరావాస కాలనీ ఏర్పాటు చేశారు. ఇక్కడ సుమారు 800 మందికి ఇళ్లస్థలాలు కేటాయించి ఆర్ అండ్ ఆర్‌ప్యాకేజీ చెల్లించడంతో వీరంతా ఇళ్లు నిర్మించుకుంటున్నారు. వీరికి ప్రభుత్వమే రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. దీనిలో భాగంగా రెండు లక్షల కిలో లీటర్ల సామర్థ్యం కలిగిన పెద్ద రక్షిత మంచినీటి పథకం నిర్మిస్తున్నారు. ఆదివారం ట్యాంకు కోసం శ్లాబ్ వేసేపనులు ప్రారంభించారు. ఈ పనులు జరుగుతుండగా డెక్కింగ్ కోసం వేసిన కర్రలు ఊడిపోవడంతో శ్లాబ్ కాంక్రీట్ ఒక్కసారిగా కింద కు పడిపోయింది. కింద భాగంలో పనిచేస్తున్న పాయకరావుపేట రాజుగారి బీడుకు చెందిన షేక్ అబీ, జగ్గంపేట పోలీస్‌స్టేషన్ సమీపంలో నివసిస్తున్న ఆదిశంకర సత్యనారాయణ అనే తాపీమేసీ్త్రలు తీవ్రంగా గాయపడ్డారు. కాంక్రీట్ కింద చిక్కుకున్న వారిని అతికష్టంపై బయటకు తీసి నక్కపల్లి ఆస్పత్రికి తరలించారు. ట్యాంక్ పైభాగంలో సుమారు 20 మంది పనిచేస్తున్నారు. కూలిపోతున్న సమయంలో శ్లాబ్ మధ్యభాగంలో లేకపోవడంతో పెద్ద ప్రాణ నష్టం తప్పింది. పెద్ద శబ్దంతో శ్లాబ్ కూలిపోవడంతో చుట్టుపక్కల వారు భయంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. పనులు నాసిరకంగా జరగడం, పర్యవేక్షణ లేకపోవడంతోనే వాటర్‌ట్యాంక్ నిర్మాణ దశలోనే కూలిపోయిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఘటనా స్థలాన్ని వైఎస్సార్‌సీపీ రాష్ట్రకార్యదర్శి వీసం రామకృష్ణ, సీపీఎం నాయకుడు ఎం.అప్పలరాజు, వైస్ ఎంపీపీ వీసం నానాజీ తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా వీసం రామకృష్ణ మాట్లాడుతూ నాసిరకం మెటీరియల్ ఉపయోగించడం వల్లే శ్లాబ్ వేసిన రోజునే కూలిపోయిందన్నారు. ప్రభుత్వ, అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని, క్షతగాత్రులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.


