మాకవరపాలెం: భూ సేకరణపై అధికారులు వాస్తవాలను వెల్లడించాలని మాజీ ఎంపీపీ రుత్తల సత్యనారాయణ డిమాండ్ చేశారు. పరిశ్రమల స్థాపనకు మండలంలోని పైడిపాల, పెద్దిపాలెం, బూరుగుపాలెం, తూటిపాల రెవెన్యూల పరిధిలో 4,259 ఎకరాల ల్యాండ్ బ్యాంకును సిద్ధం చేయడంలో భాగంగా 25 రోజులుగా రెవెన్యూ అధికారులు భూముల సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సర్వే ఎందుకు చేస్తున్నారనే విషయంపై అధికారులు స్పష్టత ఇవ్వలేదంటూ ఆదివారం పాపయ్యపాలెం అడవిరాజులబాబు ఆలయం వద్ద రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఏర్పాటయ్యే పరిశ్రమల వివరాలను ప్రజలకు తెలియజేయాలని, సర్వే పూర్తయిన వెంటనే రైతులకు విస్తీర్ణం తెలపాలని అన్నారు. పరిశ్రమలకు భూములు సేకరిస్తే జిరాయితీ భూములకు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ ధరకు మూడు రెట్లు, డీ పట్టా భూములకు రెండు రెట్లు, పదేళ్లుగా సాగులో ఉన్న రైతులకు కూడా డీ పట్టాకు ఇచ్చినట్టుగా నష్ట పరిహారం అందజేయాలన్నారు. ఈ భూముల్లో ఉన్న చెట్లకు కూడా పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. బూరుగుపాలెం ఎంపీటీసీ సభ్యుడు రుత్తల యర్రాపాత్రుడు మాట్లాడుతూ రైతులంతా కలసికట్టుగా ఉంటేనే సమస్యలను పరిష్కరించుకునే అవకాశం ఉందని చెప్పారు. శాంతియుతంగా ఉద్యమాలు చేయాలన్నారు. చామంతిపురం మాజీ సర్పంచ్ బొడ్డు గోవిందరావు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో పరిశ్రమలు రావడాన్ని అందరూ స్వాగతిస్తున్నామని, అయితే ఆరోగ్యానికి హాని కలిగించే పరిశ్రమల ఏర్పాటును, రైతులకు నష్టం కలిగించే చర్యలను పూర్తిగా వ్యతిరేకిస్తామన్నారు. కార్యక్రమంలో బూరుగుపాలెం, పైడిపాల, ముషిడిపాలెం, మామిడిపాలెం, కె. తూటిపాల మాజీ సర్పంచ్‌లు వొబ్బలరెడ్డి రమణ, రుత్తల శ్రీను, బుడ్డా రమణ, రుత్తల నాయుడు, గవిరెడ్డి ప్రసాదరావు, వైఎస్సార్‌సీపీ మండల యూత్ అధ్యక్షుడు రాజు, నాయకులు భీమిరెడ్డి గోవింద, యర్రా లోవ, సత్తిబాబు పాల్గొన్నారు.
నాలుగు రెవెన్యూల పరిధిలోజరుగుతున్న భూముల సర్వే
భవిష్యత్ కార్యాచరణకు సమావేశమైన రైతులు
నష్టపరిహారం, ఇతర ప్యాకేజీలపై స్పష్టతకు డిమాండ్


