మే ఐ హ్యావ్ యువర్
అటెన్షన్ ప్లీజ్.. ఫ్లైట్ నం. వీటీజెడ్..
విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ టూ
భోగాపురం ఈజ్ నౌ రెడీ ఫర్ టేకాఫ్.. అండ్
ల్యాండింగ్ ఎట్ భోగాపురం టుడే ఆన్‌వార్డ్స్.
ఆల్ బుక్‌డ్ ప్యాసింజర్స్.. ఆర్ రిక్వెస్టెడ్ టూ కీప్
దెయిర్ లగేజ్ అండ్ ప్రొసీడ్ టూ
ది భోగాపురం ఎయిర్‌పోర్ట్..
ఏంటి.. నా అనౌన్స్‌మెంట్ మారిందని ఆలోచిస్తున్నారా..?
నేనేనండీ.. మీ వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌ని.
మీ ఊరి సరిహద్దు దాటి.. గగనవీధిలో దూరతీరాలకు ఎగరాలనుకున్నప్పుడు మీ పాదాలకు ప్రప్రథమంగా రెక్కలు తొడిగింది నేనే!
తీపి జ్ఞాపకాలతో మహా నగరానికి వచ్చిన ప్రియమైన వారిని మీ ఒడికి చేర్చింది..
కొత్త ఆశల వైపు మిమ్మల్ని నడిపించింది నేనే.! ఇకపై.. నేను మీతో అనుబంధాన్ని పంచుకోలేనేమో.. ఎందుకంటే.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం సిద్ధమవడంతో.. సుదీర్ఘ కాలం పాటు మీకు అందించిన పౌర విమాన సేవలకు స్వస్తి చెబుతూ ఈరోజుతో వీడ్కోలు పలుకుతున్నాను. ఇకపై సివిల్ సర్వీసులు నిలిపేసినట్లు గెజిట్ నోటిఫికేషన్ కూడా వచ్చిందని మా డైరెక్టర్ (ఎయిర్‌పోర్ట్) పురుషోత్తం కూడా ప్రకటించేశారు. ఎనిమిది దశాబ్దాల ఈ సుదీర్ఘ ప్రయాణంలో నేను చూసిన వెలుగు నీడలు, సాధించిన విజయాలు, ఎదుర్కొన్న ఒడిదొడుకుల జ్ఞాపకాలను ఒక్కసారి మీతో పంచుకోవాలనిపించింది. నా జ్ఞాపకాలు మీ గుండెల్లో పదిలంగా ఉన్నాయని నాకు తెలుసు. నా సుదీర్ఘ ప్రయాణంలో మైలురాళ్లు, ఎదుర్కొన్న ఒడిదొడుకులు, సాధించిన విజయాల జ్ఞాపకాలను ఒక్కసారి మీ ముందుంచుతున్నాను.
నా పుట్టుకే ఓ ‘యుద్ధం’..!
అమ్మ కడుపులోంచి మీరందరూ బయటకు రావడానికి ఓ యుద్ధమే జరుగుతుంది. అలానే నా రక్తసిక్తమైన యుద్ధ భూమిలో నా జననం జరిగింది. నా పుట్టుక ఏ సౌకర్యవంతమైన ప్రయాణాల కోసమో జరగలేదు. 1940 ప్రారంభంలో.. ద్వితీయ ప్రపంచ యుద్ధ మేఘాలు అలముకున్న వేళ.. రాయల్ ఎయిర్‌ఫోర్స్(రాఫ్).. తమ సైనిక అవసరాల కోసం మేఘదూతలా ఒక చిన్న ఎయిర్‌స్ట్రిప్‌గా నేను రూపుదిద్దు కున్నాను. యుద్ధం ముగిశాక కొంతకాలం ప్రశాంతంగా ఉన్నా.. 1972 నాటికి భారత నౌకాదళం నా పరిసరాల్లో తమ కార్యకలాపాలను ప్రారంభించింది. ఆ తర్వాత 1986లో నా పూర్తి యాజమాన్యం భారత నౌకాదళం పరిధిలోకి వచ్చింది. 1991 అక్టోబర్ 21న నాకు అధికారికంగా ’ఐఎన్‌ఎస్ డేగాా’ అని నామకరణం పేరుపెట్టి నేవల్ ఎయిర్‌స్టేషన్‌గా తీర్చిదిద్దారు.
ఒక్క విమానంతో మొదలై..
నౌకాదళానికి చెందిన స్థలంలోనే పౌర విమాన సర్వీసులు ప్రారంభించేందుకు ‘ఎయిర్‌ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా’ నా ప్రాంగణంలో సివిల్ ఎన్‌క్లేవ్‌ని ఏర్పాటు చేసింది. నా స్థావరం నుంచి క్రమబద్ధంగా వాణిజ్య ప్రయాణికుల సేవలు 1981లో ప్రారంభమయ్యాయి. ఇండియన్ ఇండిగో (అప్పట్లో ఇండియన్ ఎయిర్‌లైన్స్) విమానం రోజుకు కేవలం ఒకే ఒక్క సర్వీసుతో ఇక్కడి నుంచి హైదరాబాద్ మీదుగా ప్రయాణించేది. పెరుగుతున్న ప్రయాణికుల రద్దీకి సరిపడా నా పాత 6,000 అడుగుల రన్‌వే సరిపోయేది కాదు. దీంతో.. 2007 జూన్ 15న ఏకంగా 10,007 అడుగుల (3,050 మీటర్లు) భారీ రన్‌వే అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక అప్పటి నుంచి ఎదురు చూడలేదు. ఇప్పుడు జాతీయ, అంతర్జాతీయం కలిపి 70కి పైగా విమానాలు.. నా దగ్గర నుంచి రయ్‌రయ్‌మంటున్నాయి. 2009 ఫిబ్రవరిలో నూతన టెర్మినల్ భవనం ప్రారంభమైంది. అప్పటిదాకా పగటి పూటకే పరిమితమైన నాకు 2012లో ‘రాత్రివేళల ల్యాండింగ్’ సదుపాయం కల్పించారు. దాంతో సింగపూర్, మలేషియా, దుబాయ్ వంటి అంతర్జాతీయ నగరాలకూ నా ద్వారా రాకపోకలు విస్తరించుకుంటూ.. మీకు సేవలందించాను.
ఆంక్షల మరకలు..
ఒక వైపు పౌర విమానాలు, మరోవైపు రక్షణ శాఖ యుద్ధ విమానాలతో నా వల్ల మీరు(ప్రయాణికులు) ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాత్రివేళల్లో ఆంక్షలు, నావికాదళ శిక్షణ సమయంలో సివిల్ విమానాలకు నిరీక్షణ వంటి సమస్యలు నాకు ఎంతో ఆవేదన మిగిల్చాయి. కానీ.. మీరు ఎప్పుడూ నన్ను దూరం చేసుకోలేదు. ఆ పట్టుదలతోనే.. నా కలలకు రెక్కలు తొడుగుతూ.. మిమ్మల్ని మీ గమ్యస్థానాలకు చేర్చాను.
అటెన్షన్ ప్లీజ్
ప్యాసింజర్స్...
ఇక్కడ చివరి ఫ్లైట్ విజయవాడ.. అక్కడ తొలిఫ్లైట్ సింగపూర్
నా సేవలు ఆదివారం అర్ధరాత్రితో ముగిసిపోయాయి. ఇక్కడి నుంచి వెళ్లిన చివరి ఫ్లైట్ సర్వీస్‌గా విశాఖ నుంచి ఢిల్లీ వెళ్లే ఇండిగో సర్వీసు నిలిచిపోయింది. అదేవిధంగా.. ఇక్కడ ల్యాండింగ్ అయిన చివరి సర్వీసుగా విజయవాడ నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం చరిత్రలో నిలిచిపోతుంది. అన్నట్లు.. మీ కొత్త ప్రయాణం మొదలయ్యే భోగాపురం విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న తొలి సర్వీసుగా సింగపూర్ స్కూట్ ఎయిర్‌లైన్స్ విమానం కొత్త చరిత్రకు తొలి అడుగుగా మారుతోంది. నన్ను వీడి భోగాపురం చేరుకున్నా.. మీ ప్రతి ప్రయాణంలో.. నా జ్ఞాపకాలు సజీవంగా ఉంటాయని ఆశిస్తున్నాను. ఎప్పుడైనా.. గగన విహారంలో వెళ్తున్నప్పుడు.. పై నుంచి నేను కనిపిస్తే.. ఒక హాయ్ చెప్పడం మర్చిపోవద్దు సుమా..!
ఇక సెలవు! మీ..
విశాఖపట్నం అంతర్జాతీయవిమానాశ్రయం
– సాక్షి, విశాఖపట్నం
గోపాలపట్నం: ఆదివారం రాత్రి 10.45 గంటలకు విజయవాడ నుంచి విశాఖకు దిగిన ఎయిర్ ఇండియా విమానమే ఇక్కడ చివరి షెడ్యూల్డ్ ఫ్లైట్‌గా నిలిచింది. నిజానికి ఈ విమానం ఒక యుగాన్ని వెంటబెట్టుకుని వచ్చింది. రన్‌వేపై చక్రాలు తాకిన ఆ క్షణమే, ఎన్నో కుటుంబాల కథలు, ఎన్నో వీడ్కోళ్లు, ఎన్నో కలయికలు నేసిన ఈ గడ్డ... ఇవాళ్టితో మౌనంగా మారిపోయింది. 65 ఏళ్లు అంటే మాటలు కాదు. ఈ టార్మాక్‌పై తొలిసారి కాలుమోపిన అధికారి ఈపాటికి రిటైరై మనవళ్లతో ఆడుకుంటుండొచ్చు. ఇక్కడి కౌంటర్ల దగ్గర తొలి జీతం అందుకున్న యువకుడు ఈరోజు తెల్లబడిన జుట్టుతో, తడిసిన కళ్లతో తన ఐడీ కార్డును చివరిసారి మెడలో నుంచి తీస్తున్నాడు. దశాబ్దాలుగా ఇక్కడే సేవలందించిన కార్మికులు, సిబ్బంది ఈరోజు తమ కళ్లను తడి చేసుకోకుండా ఉండలేకపోయారు. కొందరు తోటి ఉద్యోగుల భుజం మీద తలవాల్చి కన్నీళ్లు పెట్టుకుంటే, మరికొందరు మాట రాక మౌనంగా నిలబడిపోయారు. ‘ఈ నేలతో మా జీవితం పెనవేసుకుపోయింది, ఇప్పుడు దాన్ని వదిలి వెళ్లాలంటే గుండె తరుక్కుపోతోంది’ అంటూ కొందరు ఉద్యోగులు కంటతడి పెట్టుకున్న దృశ్యాలు అందరినీ కదిలించాయి. ఎవరికి వారు గుర్తుచేసుకుంటున్నారు.. ఎన్నో వానాకాలాల్లో ఫ్లైట్లు ఆలస్యమైనప్పుడు కలిసి టీ తాగిన క్షణాలను, పండగలకు సెలవులు లేకున్నా విధి నిర్వర్తించిన రాత్రులను, కంట్రోల్ టవర్ నుంచి ప్రతి ల్యాండింగ్‌నూ కళ్లారా చూసిన ఉద్విగ్న క్షణాలను. సామాన్లు సర్దుతున్న సిబ్బంది చేతులు వేగంగా కదులుతున్నా, మనసులు మాత్రం వెనక్కి లాగుతున్నాయి. ఒకరినొకరు కావలించుకుని, ‘మళ్లీ కలుద్దాం’అని బొంగురుపోయిన గొంతుతో చెప్పుకుంటున్నారు.. ఈ గోడల మధ్య, ఈ రన్‌వే పక్కన మాత్రం మళ్లీ కలవలేమని అందరికీ తెలుసు.ఇకపై ఇక్కడ యుద్ధ విమానాల గర్జన వినిపించొచ్చు, పోలీసు హెలికాప్టర్ల రెక్కల చప్పుడు వినిపించొచ్చు. కానీ సామాన్యుడిని ఆకాశంలోకి మోసుకెళ్లిన ఆ విమానాల శబ్దం మాత్రం, ఇక ఇక్కడ వినిపించదు. విశాఖ గగనానికి, పాత విమానాశ్రయానికి మధ్య ఉన్న ఈ అనుబంధం... ఈ రాత్రితో చరిత్ర పుటల్లోకి చేరిపోతోంది. కానీ ఆ 65 ఏళ్ల జ్ఞాపకాలు మాత్రం, ఇక్కడ సేవలందించిన ప్రతి గుండెలోనూ శాశ్వతంగా ఎగురుతూనే ఉంటాయి.


