ప్రాణాలు తీస్తున్న పసుపు రంగు తాగునీరు! | Ground­wa­ter that glows yel­low green | Sakshi
Sakshi News home page

ప్రాణాలు తీస్తున్న పసుపు రంగు తాగునీరు!

Aug 17 2026 10:26 AM | Updated on Aug 17 2026 10:26 AM

Ground­wa­ter that glows yel­low green

ఫతేపూర్: ఉత్తరప్రదేశ్‌లో దశాబ్దాలుగా పేరుకుపోయిన పారిశ్రామిక వ్యర్థాల నిర్లక్ష్యం ఇపుడు కొన్ని జిల్లాల్లోని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. రాష్ట్రంలోని ఫతేపూర్, కాన్పూర్ దేహత్, కాన్పూర్ నగర్ జిల్లాల్లో భూగర్భ జలాలు ప్రమాదకర క్రిమియం, హెక్సావాలెంట్ క్రోమియంతో తీవ్రంగా కలుషితమయ్యాయి. ఈ నీరు పసుపు లేదా ఆకుపచ్చ రంగులో ప్రవహిస్తుండటం విశేషం. ఇక్కడి గ్రామాల్లో దొరుకుతున్న ఈ నీటిని తాగితే క్షణాల్లో వాంతులు కావడం, చర్మంపై దద్దుర్లు, కాలేయ వ్యాధులు రావడం జరుగుతోందని స్థానికులు వాపోతున్నారు.

ఫతేపూర్‌లోని చివాలి గ్రామంలో హ్యాండ్ పంపుల నుంచి రసాయనాల మిళితమైన నీరు వస్తోంది. గత ఐదేళ్లలో ప్రభుత్వం సేకరించిన రక్త నమూనాల నివేదిక ప్రకారం.. ప్రభావిత ప్రాంతాల్లో ఏకంగా 73% నుండి 96% మందిలో మోతాదుకు మించి క్రోమియం ఉన్నట్లు తేలింది. ఈ నీటిని వాడటం వల్ల పశువులు వ్యాధుల బారిన పడటం, ప్రజలకు చర్మ సమస్యలు, కడుపునొప్పి, జీర్ణకోశ వ్యాధులు వస్తున్నాయి. అంతర్జాతీయ క్యాన్సర్ ఏజెన్సీ (ఐఏఆర్‌సీ)క్రోమియం (వీఐ)ను క్యాన్సర్ కారకంగా వర్గీకరించింది.

19వ శతాబ్దం నుంచి ఇక్కడ ఉన్న లెదర్ ట్యాన్నరీలు (చర్మశుద్ధి పరిశ్రమలు) వాడే క్రోమియం సల్ఫేట్ వ్యర్థాలను, విషపూరిత మట్టిని గతంలో గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల  నిర్మాణాలకు ఉచితంగా ఇచ్చారు. కాలక్రమేణా ఆ విషరసాయనాలు భూగర్భంలోకి ఇంకి నీటిని పూర్తిగా విషపూరితం చేశాయి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ)ఆదేశాలతో గత ఏడాది రానియా ప్రాంతంలో పేరుకుపోయిన వేల టన్నుల వ్యర్థాలను తొలగించినా, ఇప్పటికీ పూర్తి స్థాయిలో శుభ్రం కాలేదు. ఐఐటీ కాన్పూర్ నిపుణులు ప్రస్తుతం ఈ ప్రాంతాలపై సమగ్ర అధ్యయనం చేస్తున్నారు. శుద్ధి చేసిన తాగునీరు అందక స్థానికులు మరోమార్గం లేక  ఇదే కలుషిత నీటిని తాగుతూ నరకయాతన అనుభవిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement