నాతవరం: ప్రభుత్వ భూములు, చెరువులు కబ్జాకు గురికాకుండా కాపాడాల్సిన రెవెన్యూ అధికారులు మామూళ్ల మత్తులో పడి అక్రమార్కులకు అప్పనంగా అప్పగించేస్తున్నారు. ఇదే తరహాలో నాతవరం మండలం వి.బి. అగ్రహారం గ్రామ రెవెన్యూలో సర్వే నంబరు 21/1లో నాలుగెకరాల శివయ్య చెరువును ఓ వ్యక్తికి రాసిచ్చేశారు. బ్రిటిష్ కాలం నాటి ఈ చెరువు ఆయకట్టు కింద 150 ఎకరాల్లో వరి సాగు చేసుకునేవారు. తాండవ రిజర్వాయరు నిర్మించిన తర్వాత నుంచి ఈ చెరువు నీరుపై రైతులు ఆధారపడటం లేదు. ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లా తునికి చెందిన యేడిద గంగారావు రెవెన్యూ అధికారులతో కుమ్మకై ్క తన భార్య పద్మావతి పేరుపై మూడెకరాలకు డీపట్టా మంజూరు చేయించుకున్నాడు. 2017లో పద్మావతి తన కుమారుడు రామచంద్రరావు పేరు మీద గిఫ్ట్ డీడ్ కింద తునిలో రిజిస్ట్రేషన్ చేసింది. ఇటీవల ప్రభుత్వ రీసర్వేలో చెరువు విస్తీర్ణం ఎకరం మాత్రమే నమోదు కావడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ ఏడాది తీవ్ర వర్షాభవ పరిస్థితుల్లో చెరువు ఎండిపోయింది. సదరు వ్యక్తి గత నెలలో వ్యవసాయం చేసేందుకు వచ్చాడు. దీన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. తమ వద్ద రికార్డులు ఉన్నాయంటూ అతడు ఎదురుదాడికి దిగాడు. దాంతో గ్రామస్తులు పోరాటానికి దిగారు.
రాజకీయాలకు అతీతంగా పోరాటం
చెరువును కాపాడుకునేందుకు గ్రామస్తులు రాజకీయాలకు అతీతంగా ఏకమై ఈ నెల 14వ తేదీన తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. చెరువు గర్భంలో ఇచ్చిన పట్టాను వెంటనే రద్దు చేసి నిబంధనలు ఉల్లఘించిన రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
తుని వ్యక్తికి డీ పట్టా మంజూరు
ఆపై గిఫ్డ్‌గా రిజిస్ట్రేషన్
రెవెన్యూ అధికారుల తీరుపై విస్మయం
లోకాయుక్తను ఆశ్రయించిన వి.బి.అగ్రహారం గ్రామస్తులు


