అనకాపల్లి: జిల్లా కేంద్రం అనకాపల్లిలోగల ఎన్టీఆర్ ఆస్పత్రికి నిర్లక్ష్యపు సుస్తీ చేసింది. సకాలంలో వైద్య సేవలందకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పర్యవేక్షణ లోపించడంతో చిన్నపాటి వ్యాధులకు కూడా రోగులను కేజీహెచ్‌కు రిఫర్ చేస్తూ చేతులు దులుపుకొంటున్నారు. దీంతో పేద రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సకాలంలో వైద్య సేవలందకున్నా పట్టించుకునే నాథుడే లేడు. ఈ ఆస్పత్రికి అనకాపల్లి, చోడవరం, మాడుగుల, పాయకరావుపేట, నర్సీపట్నం, యలమంచిలి నియోజకవర్గాల నుంచి వైద్యం కోసం రోగులు వస్తుంటారు. చంద్రబాబు ప్రభుత్వ పాలనలో ఆస్పత్రిలో సేవలు నానాటికీ తీసికట్టుగా మారాయి. పబ్లిసిటీకి చేస్తున్న ఖర్చులో కొంతభాగమైనా పేద రోగులకు ఖర్చు చేస్తే బాగుంటుందని రోగులు, వారి బంధువులు కోరుతున్నారు.
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఎన్టీఆర్ ఆస్పత్రికి వందలాదిమంది రోగులు వస్తుంటారు. సోమవారం, బుధవారం, గురువారాల్లో ఓపీ 1200 వరకూ ఉంటుంది. మిగతా రోజుల్లో 600 నుంచి 800 వరకు ఉంటుంది. అత్యవసర సమయంలో మెరుగైన వైద్యం అందుతుందనే ఆశతో వచ్చే పేద రోగులకు నిరాశే ఎదురవుతోంది. ఆస్పత్రిలో సకల సదుపాయాలు ఉన్నాయని అధికారులు, ప్రజాప్రతినిధులు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం సరైన వైద్యం అందక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ప్రత్యేక వైద్యుల కొరత
ఆస్పత్రిలో కార్డియాలజీ, న్యూరాలజీ, క్రిటికల్ కేర్ వంటి విభాగాల్లో నిపుణులైన వైద్యులు అందుబాటులో లేకపోవడం పెద్ద శాపంగా మారింది. అత్య వసర సర్జరీలు చేయాల్సి వస్తే చేతులెత్తేస్తున్నా రు. మౌలిక సదుపాయాల లేమి, సక్రమంగా పనిచేయ ని వెంటిలేటర్లు, నిరుపయోగంగా మారిన డయాగ్నోస్టిక్ పరికరాల కారణంగా రోగులకు సక్ర మంగా వైద్యసేవలందడం లేదు. ఈ ఆస్పత్రిలో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో 50 పడకల క్రిటికల్ కేర్ నూతన ఆస్పత్రిని నిర్మించారు. సుమారు ఏడాదిగా ఇది నిరుపయోగంగా మారింది.
కేజీహెచ్‌పై పెరిగిన భారం
ఎన్టీఆర్ ఆస్పత్రికి వచ్చిన చిన్నచిన్న కేసులను కూడా ఇక్కడి వైద్యులు కేజీహెచ్‌కు రిఫర్ చేసి చేతులు దులుపుకొంటున్నారని రోగులు, వారి బంధువులు ఆరోపిస్తున్నారు. అక్కడికి వెళ్లి వైద్యం చేయించుకోవడం ఇబ్బందిగా మారిందని వారు చెబుతున్నారు. నెలలో ఇక్కడి నుంచి 170 కేసుల వరకూ కేజీహెచ్‌కు రిఫర్ చేస్తున్నారు.అధిక సంఖ్యలో కేసులను రిఫర్ చేస్తుండడంతో కేజీహెచ్‌కు రోగుల తాకిడి ఎక్కువవుతోంది. దీంతో అక్కడ వైద్య సేవలందడంలో జాప్యం జరుగుతోంది.
పేదలపై మోయలేని ఆర్థిక భారం
అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి వస్తే సకాలంలో 108 అంబులెన్సులు దొరకక ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. దూరప్రాంతాల నుంచి కేజీహెచ్‌కి వెళ్లడానికి ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తుండటంతో వేలాది రూపాయ లు ఖర్చవుతున్నాయి. ఉచిత వైద్యం అందుతుందని భావించిన నిరుపేదలకు ఈ ప్రయాణ ఖర్చు లు మోయలేని భారంగా మారుతున్నాయి. ఆస్పత్రిలో సక్రమంగా రక్తపరీక్షలు నిర్వహించకపోవడంతో రోగులు ప్రైవేట్ ల్యాబ్‌లకు వెళ్లి, నగదు చెల్లించి పరీక్షలు చేయించుకోవలసి వస్తోంది.
అందుబాటులో ఉండని వైద్యులు
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఎన్టీఆర్ ఆస్పత్రికి వచ్చే రోగులకు వైద్యులు అందుబాటులో ఉండడం లేదు. కొంతమంది వైద్యులు ఆరోగ్య సమస్యను పూర్తిగా వినకుండానే, పరిశీలించకుండానే వారికి తోచిన మందులు రాసి పంపిస్తున్నారని రోగులు, వారి బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొంత మంది వైద్యులు తమ ప్రైవేట్ క్లినిక్‌లకు రమ్మని చెబుతున్నారని వాపోతున్నారు.
వైద్య విద్యార్థులతో ట్రీట్‌మెంట్
పట్టణ పరిధిలోని ప్రైవేట్ కళాశాలల్లో వైద్య విద్యను చదువుతున్న విద్యార్థులే రోగులకు ట్రీట్‌మెంట్ చేస్తున్నారు. వారికి సరైన అవగాహన లేకపోవడంతో రోగులు ఇబ్బందులకు గురవుతున్నారు. సుమారు 15 రోజుల క్రితం ఒక వైద్య విద్యార్థి వేసిన ఇంజెక్షన్ వికటించింది. అక్కడే ఉన్న వైద్యుడు సకాలంలో స్పందించడంతో రోగి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడు.


