నా ప్రయాణం అంత తేలికగా సాగలేదు. నేనెన్నో మెరుపులు చూశాను.. కొన్ని చేదు మరకలనూ ఎదుర్కొన్నాను. 2005లో కురిసిన భారీ వర్షాలకు నీట మునిగిపోయాను. దాదాపు 10 రోజుల పాటు నా రన్‌వే నీటిలో మునిగిపోయి సేవలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఇక నా పనైపోయిందని అందరూ అన్నారు. ఇక 2014లో నా జీవితంలోనే అత్యంత దారుణమైన ఘటన జరిగింది. 2014 అక్టోబరు 12న గంటకు 200 కిలోమీటర్ల వేగంతో వీచిన హుద్ హుద్ తుపాన్ గాలులు.. నా టెర్మినల్ కప్పును ఎగరగొట్టాయి. అద్దాలన్నీ పగిలిపోయి, నా సర్వస్వం ఛిన్నాభిన్నమైంది. అదే నా చివరి రోజు అని అనుకున్నాను. కానీ, నేవీ అధికారుల అహోరాత్రులు శ్రమించడంతో.. కేవలం పదంటే పది రోజుల్లోనే కోలుకుని మళ్లీ విమానాలకు స్వాగతం పలికాను. ఇందులో మీ సహకారం కూడా ఎంతో ఉందని నాకు తెలుసు.


