జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన హోం మంత్రి అనిత ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవం ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు, శకటాల ప్రదర్శన
అనకాపల్లి/తుమ్మపాల : ఎందరో మహానీయుల త్యాగాల ఫలితంగా మనకు స్వాతంత్య్రం వచ్చిందని, అనకాపల్లి కేవలం జిల్లా కాదని... పోరాటాల గడ్డని, అల్లూరి సీతారామరాజు పోరాట స్ఫూర్తి, గురజాడ అప్పారావు సామాజిక చైతన్యం జిల్లాకు ఎంతో పేరు తెచ్చాయని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. స్థానిక ఎన్టీఆర్ క్రీడామైదానంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న హోంమంత్రి జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ విజయ కృష్ణన్, ఎస్పీ తుహిన్ సిన్హాతో కలిసి వందన సమర్పణ చేశారు. పరేడ్ కమాండర్ పి.హరినాథ్ ఆధ్వర్యంలో పోలీసు దళం మంత్రికి సెల్యూట్ సమర్పించగా, పోలీస్ బ్యాండ్ బృందం జాతీయగీతాన్ని ఆలపించింది.
అనంతరం మంత్రి మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలని, స్వాతంత్య్ర సమరయోధులు కలలుగన్న స్వేచ్ఛా యుత, సమృద్ధి, శాంతియుత భారత నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. దేశ ప్రగతిలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని తెలిపారు. రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. స్వాతంత్య్రం మనకు స్వేచ్ఛను ఇచ్చిందని, స్వర్ణ ఆంధ్ర 2047 మనకు ఒక లక్ష్యాన్ని ఇచ్చిందని, ఆ లక్ష్యాన్ని సాధించేందుకు, ప్రజలకు ఇచ్చిన హామీలను కార్యరూపంలోకి తీసుకువచ్చేందుకు నిరంతరం కృషి చేయాలన్నారు. రైతుకు భరోసా, మహిళకు సాధికారత, అవ్వాతాతలకు పింఛన్లు, పేద కుటుంబాలకు సంక్షేమం, యువతకు ఉపాధి, పరిశ్రమలకు ప్రోత్సాహం, పర్యాటక రంగం అభివృద్ధి, గ్రామాలకు మౌలిక వసతులు.. ఇవే అభివృద్ధికి నిజమైన కొలమానాలన్నారు. రైతన్నలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు చెప్పారు. ప్రతి ఇంటిని సందర్శించి ఎల్ నినో మిటిగేషన్ ప్లాన్‌లో భాగంగా ప్రత్యామ్నాయ పంటల సాగుకు సంబంధించిన సూచనలు, సలహాలు అందిస్తున్నట్టు చెప్పారు. రూ.9.82 కోట్లతో 3,850 ఎకరాల్లో పండ్లు, కూరగాయలు, ఆయిల్‌పామ్ తోటల పునరుద్ధరణ, సస్యరక్షణకు లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందన్నారు. ప్యాక్‌హౌస్‌లు, శీతల గిడ్డంగుల ఏర్పాటు, ప్రాసెసింగ్ యూనిట్లతో పంటకోత అనంతరం నష్టాల తగ్గింపు, విలువ ఆధారిత ఉత్పత్తులను ప్రోత్సహించనున్నట్టు చెప్పారు.
● ఈ ఏడాది 7.52 లక్షల మెట్రిక్ టన్నుల పాలు, 38 వేల మెట్రిక్ టన్నుల మాంసం, 125 కోట్ల గుడ్ల ఉత్పత్తి ద్వారా రూ.11,722 కోట్ల ఆదాయాన్ని సమకూర్చే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు తెలిపారు. ఎల్‌నినో ప్రభావం ఎదుర్కోడానికి 32 ఎంటీల పశుగ్రాసం విత్తనాలు 75 శాతం రాయితీతో సరఫరా చేస్తున్నట్టు చెప్పారు.
● మోటార్ బోట్లు ఉన్న మత్స్యకారులకు డీజిల్‌పై లీటరుకు రూ.9 సబ్సిడీగా రూ.53.05 లక్షల చెల్లింపు. పీఎంఎంఎస్‌వై కింద 129 మందికి బోటు ఇంజిన్లు, 3 బయోఫ్లాక్ యూనిట్లు, ఐస్ ప్లాంట్, 3 చేపల రవాణా వాహనాలు, 474 బోట్లకు భద్రతా పరికరాలు, 100 మందికి జీపీఎస్, 200 మందికి సోలార్ లైట్లు పంపిణీ.
● జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 2026–27లో 41,878 మంది మహిళా పారిశ్రామికవేత్తలకు బ్యాంకుల ద్వారా రూ.610.96 కోట్లు, 21,043 మందికి సీ్త్రనిధి ద్వారా రూ.183.81 కోట్లు పంపిణీ.
● జిల్లా నీటి యాజమాన్య సంస్థ ద్వారా వీబీ–జి–రామ్–జీ పథకం ద్వారా 2.45 లక్షల మందికి 90.80 లక్షల పనిదినాలు కల్పించి, రూ.256.81 కోట్ల వేతనాలు బ్యాంకు ఖాతాల్లో జమ.
● స్వర్ణ పంచాయతీ వెబ్‌సైట్ ద్వారా రూ.35.45 కోట్ల ఇంటి పన్నులు వసూలు, 24 స్వచ్ఛరథాల ద్వారా 601 టన్నులకు పైగా పొడి చెత్త సేకరణ. శృంగవరం గ్రామ పంచాయతీకి జాతీయస్థాయి ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డుతో పాటు రూ. కోటి గ్రాంటు.
● జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ అభివృద్ధి సంస్థ ద్వారా జిల్లాలో 116 మినీ అంగన్‌వాడీ కేంద్రాలను ప్రధాన కేంద్రాలుగా అప్‌గ్రేడ్, 171 ఖాళీ పోస్టుల భర్తీ.
● నవచేతన్ యాప్ ద్వారా 1,567 కేంద్రాల్లో ఏఐ ఆధారిత బాల్య వికాస స్క్రీనింగ్ ప్రారంభం.
● సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 533 మంది ఎస్టీ విద్యార్థులకు పోస్ట్‌మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల కింద రూ.1.06 కోట్లు, సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా 3,270 మంది ఎస్సీ విద్యార్థులకు రూ.3.85 కోట్ల స్కాలర్‌షిప్‌లు.
● ఖనిజ ప్రభావిత ప్రాంతాల్లో రూ.32.44 కోట్ల తో 245 పనులకు అనుమతులు మంజూరు. పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖలో పల్లెపండగ 2.0 కింద రూ.101.17 కోట్లతో 197.20 కిలోమీటర్ల సీసీ రోడ్లు, రూ.5.11 కోట్లతో 10.33 కిలోమీటర్ల బీటీ రోడ్ల నిర్మాణం.
● అనకాపల్లి–అచ్యుతాపురం నాలుగు లైన్ల రహ దారి విస్తరణ, గ్రామీణ నీటి సరఫరా, పారిశుధ్యశాఖలో జల్‌జీవన్ మిషన్ కింద 1,226 పనులు పూర్తి, 3.04 లక్షల గృహాలకు తాగునీటి కుళాయి కనెక్షన్లు మంజూరు చేసినట్టు ఆమె చెప్పారు.
560 మంది ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు
జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ పనితీరు కనబరిచిన 560 మంది అధికారులు, ఉద్యోగులు, పోలీసులు, ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు హోంమంత్రి, కలెక్టర్, ఎస్పీ ప్రశంసాపత్రాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో జేసీ శౌర్యమాన్ పటేల్, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు పీలా గోవింద సత్యనారాయణ, బత్తుల తాతబాబు, మళ్ల సురేంద్ర, కోట్ని బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
రెండు శకటాలకు
సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై పలు ప్రభుత్వ శాఖలు రూపొందించిన శకటాలను ఈ సందర్భంగా ప్రదర్శించారు. 16 శకటాలను ప్రదర్శించగా ప్రథమ బహుమతిని రెండు శకటాలు గెలుచుకున్నాయి. నూతన పెట్టుబడులకు పారిశ్రామిక గమ్యస్థానం (జోనల్ మేనేజర్ ఏపీఐఐసీ అనకాపల్లి), బాల్య వివాహాల నిర్మూలన (పీడీ డిస్ట్రిక్ట్ ఉమెన్ డెవలప్‌మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్) శకటాలు ప్రథమ బహుమతి సొంతం చేసుకున్నాయి. స్వయం ఏపీ (పీడీ డీఆర్‌డీఏ అండ్ పీడీ ఎంపీఎంఏ), సురక్షిత కార్మికులు–సుస్థిర పారిశ్రామిక ప్రగతి (డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, బాయిలర్స్, డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ అండ్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్) శకటాలు ద్వితీయ బహుమతి సాధించాయి. జిల్లా అగ్రికల్చర ల్ ఆఫీసర్ (అనకాపల్లి), డీపీఎం ఏపీ న్యాచురల్ ఫార్మింగ్ కార్పొరేషన్, జిల్లా హార్టీకల్చర్ ఆఫీసర్ (ఎల్ నినో–ఆల్టర్నేటివ్ క్రాప్స్ – మాతృక పంటలు) శకటాలు మూడో బహుమతి పొందాయి.
జాతీయ జెండాకు వందనం చేస్తున్న హోం మంత్రి అనిత, కలెక్టర్ విజయ కృష్ణన్, ఎస్పీ తుహిన్ సిన్హా
మువ్వన్నెల జెండా మురిసింది... ఆకాశం నిండా మెరిసింది. ఆబాలగోపాలం మా తుజే సలామ్ అంటూ ముక్తకంఠంతో నినదించింది. వందేమాతర గీతం ప్రతిధ్వనించింది. జనగణమన అంటూ జనులందరూ గొంతెత్తి పాడగా జాతీయ పతాకం పరవశించిపోయింది. జిల్లాలో స్వాతంత్య్ర సంబరాలు నింగినంటాయి. జిల్లా కేంద్రం అనకాపల్లిలోని ఎన్టీఆర్ స్టేడియంలో శనివారం జిల్లా స్థాయి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు, స్టాళ్లు, శకటాలు అలరించాయి.


