మహారాణిపేట(విశాఖ): కేజీహెచ్‌లో జూనియర్ వైద్యుల నిరవధిక సమ్మెతో రోగులకు వైద్య సేవలు అందక అవస్థలు తప్పడం లేదు. మరోవైపు శనివారం ఆగస్టు 15 కావడంతో రెగ్యులర్ వైద్యులకు అధికారిక సెలవు ఉండటం, ఆదివారం కూడా సెలవు కావడంతో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. దీంతో పలు వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులకు సకాలంలో వైద్య సేవలు అందక ఇబ్బందులు పడుతున్నారు. సాధారణంగా వైద్యులు అందుబాటులో లేని సమయంలో మూడు షిఫ్టుల్లో జూనియర్ వైద్యులు, హౌస్ సర్జన్లు విధులు నిర్వహిస్తుంటారు. అయితే జూనియర్ వైద్యులు సమ్మెలో ఉండటంతో ఆ సేవలు నిలిచిపోయాయి. దీంతో కొన్ని చోట్ల నర్సులే అత్యవసర పరిస్థితుల్లో రోగులకు సేవలు అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వైద్యుల కోసం రోగులు, వారి సహాయకులు ఎదురుచూడాల్సి వస్తోంది. జూనియర్ వైద్యుల సమ్మె ప్రభావం ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే ఓపీ రోగులపైనా పడింది. కేజీహెచ్‌కు శనివారం సాధారణ రోజులతో పోలిస్తే కొత్తగా వచ్చే రోగుల సంఖ్య గణనీయంగా తగ్గింది. సమ్మె నేపథ్యంలో అత్యవసర పరిస్థితి లేని కొందరు రోగులు ప్రభుత్వ ఆస్పత్రులకు రావడానికి వెనుకాడుతున్నట్లు తెలుస్తోంది. కేజీహెచ్‌లోని పలు వార్డుల్లో ఇదే పరిస్థితి నెలకొంది.


