నాతవరం: వారు అడవితల్లి బిడ్డలు... ఎంత కష్టమైనా చెదరని ఆత్మవిశ్వాసం వారి సొంతం. అయితే, తరాలు మారుతున్నా వారి తలరాతలు మాత్రం మారడం లేదు. హామీలు ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా అమలు కావడం లేదు. కూటమి ప్రభుత్వంలో సమస్యలు పరిష్కారం కాకపోవడంతో నిత్యం అవస్థలకు గురవుతున్నారు. జిల్లాలో నాతవరం మండలంలోనే అధికంగా గిరిజనులు నివసిస్తున్నారు. వీరంతా పలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. ముఖ్యంగా ఆర్‌వోఎఫ్‌ఆర్ పత్రాలు, ఐటీడీఏ పథకాలు, వైద్యసేవలు, సరైన రోడ్లు, విద్య వంటి ఏ సౌకర్యాలకూ నోచుకోక తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు.
ఆదివారం అంతర్జాతీయ ఆదివాసీల దినోత్సవాన్ని సరుగుడు పంచాయతీ రామన్నపాలెంలో జిల్లాస్థాయిలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి స్పీకర్, కలెక్టర్, ఇతర అధికారులు హాజరుకానున్నారు. స్పీకర్ గతంలో తమకు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ, ఇప్పటికై నా వాటిని నెరవేర్చాలని మండలంలోని 19 గ్రామాల గిరిజనులు కోరుతున్నారు. సరుగుడు, సుందరకోట పంచాయతీల్లో అసనగిరి, తొరడ, కొత్త దద్దుగుల, మాసంపల్లి, రామన్నపాలెం, అచ్చంపేట, యరకంపేట, రాజవరం, సిరిపురం, ముంతమామిడి, లోద్దు, కొత్త లంకలు, బమ్మిడిక లోద్దు, దద్దుగుల తదితర గ్రామాల ఆదివాసీలు పలు సమస్యలతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు
హామీలిచ్చి ఏడాది దాటినా...
కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత సుందరకోటలో జరిగిన గ్రామసభలో పాల్గొనేందుకు స్పీకరు అయ్యన్నపాత్రుడు వచ్చారు. ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తితో పాటు గిరిజనులంతా కలిసి ఆయన దృష్టికి పలు సమస్యలు తీసుకెళ్లారు. మండలంలోని సరుగుడు, సుందరకోట తదితర పంచాయతీల్లో 10 వేల ఎకరాలకు పైగా గ్యాప్ ఏరియా భూమి ఉంది. ఈ భూముల్లో తుప్పలు, రాళ్లను తొలగించి గిరిజనులు పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వాటికి హక్కుపత్రాలు పంపిణీ చేయాలని, సెల్ టవర్లు నిర్మించాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని స్పీకర్‌ను కోరారు. అడిగిందే తడువుగా సమస్యల పరిష్కారానికి అయ్యన్నపాత్రుడు హామీ ఇచ్చారు. అయితే ఏడాదిదాటినా వాటి గురించి పట్టించుకున్న పాపాన పోలేదు.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో...
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అర్హత ఉన్న 589 మంది గిరిజనులకు అప్పటి ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అటవీ హక్కుపత్రాలు పంపిణీ చేశారు. మరో 300 మందికి హక్కు పత్రాలు ఇవ్వడానికి అధికారులు సిద్ధం చేశారు. అప్పటికే సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో వాటిని అందజేయలేకపోయారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి వాటిని పంపిణీ చేయాలని గిరిజనులు కోరుతున్నా పట్టించుకునే నాథుడే కరవయ్యాడు. స్పీకర్ హామీ ఇచ్చినా ఇంతవరకూ అతీగతీ లేకుండా పోయింది. సమస్యను పరిష్కరించాలని అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినా ప్రయోజనం లేకపోయింది. దీంతో మా సమస్యలు ఇంకెవరికి చెప్పుకోవాలి? అంటూ గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సరుగుడులో అసంపూర్తిగా నిలిచిపోయిన సచివాలయం, హెల్త్ క్లినిక్, రైతు సేవా కేంద్రాల భవనాల నిర్మాణాలను పూర్తి చేయాలని, పాడేరు ఐటీడీఏ ద్వారా అమలవుతున్న పథకాలను తమకు అందజేయాలని వారు కోరుతున్నారు. ఆదివాసీ దినోత్సవ కార్యక్రమానికి హాజరవుతున్న స్పీకర్, కలెక్టర్ ఇప్పటికై నా తమ సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
గిరిజనుల సమస్యలు పట్టించుకునే తీరికే లేని పాలకులు
నెరవేరని స్పీకర్ వాగ్దానాలు
ఆర్‌వోఎఫ్‌ఆర్ పత్రాలు మంజూరు కాక అవస్థలు
ఐటీడీఏ పథకాలకూ నోచుకోని ఆదివాసీలు


