జిల్లాలో మూడో రోజు కొనసాగిన రిలే నిరాహార దీక్షలు
● డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం
● విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేసే వరకు ఉద్యమం ఆగదు
● స్పష్టం చేసిన డీఎస్సీ అభ్యర్థులు, వైఎస్సార్‌సీపీ నాయకులు
● అనకాపల్లి, చోడవరం, మాడుగులలో సంఘీభావం తెలిపిన జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్
● చోడవరం, అనకాపల్లి, నర్సీపట్నంలో సంఘీభావం తెలిపిన మాజీ మంత్రి అమర్‌నాథ్
● మాడుగులలో పాల్గొన్న మాజీ డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు
సాక్షి, అనకాపల్లి: డీఎస్సీ అక్రమాలపై జెన్‌జీ పోరు శనివారం మరింత ఉధృతంగా సాగింది. వైఎస్సార్‌సీపీ యువజన, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన రిలే నిరాహార దీక్షలు మూడో రోజూ విజయవంతంగా జరిగాయి. డీఎస్సీ–2025 నియామకాల్లో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలని, నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని యువతీయువకులు, విద్యార్థులు, వైఎస్సార్‌సీపీ నాయకులు డిమాండ్ చేశారు. అనకాపల్లి, మాడుగుల, చోడవరం, నర్సీపట్నంలలో జరిగిన రిలే నిరాహార దీక్షల్లో జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ పాల్గొని సంఘీభావం తెలిపారు. అనకాపల్లి, చోడవరం, నర్సీపట్నంలలో మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, మాడుగులలో మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు పాల్గొన్నారు. పెందుర్తి, యలమంచిలి, మాడుగులలో పార్లమెంట్ పరిశీలకులు శోభాహైమావతి సంఘీభావం తెలియజేశారు.


