తుమ్మపాల : స్వచ్చాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లాకు నాలుగు రాష్ట్ర స్థాయి అవార్డులు రావడం ఆనందంగా ఉందని కలెక్టర్ విజయ కృష్ణన్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు నిరంతరం కృషి చేస్తామని, వచ్చే ఏడాది మరిన్ని అవార్డులు జిల్లాకు వచ్చేలా పనిచేస్తామని తెలిపారు. గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన స్వచ్చాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా జిల్లా అధికారులకు అవార్డులను ప్రదానం చేసినట్లు ఆమె తెలిపారు. 50 వేలలోపు జనాభా కలిగిన మున్సిపాలిటీల కేటగిరీలో యలమంచిలి మున్సిపాలిటీ స్వచ్ఛ మున్సిపాలిటీగా ఎంపికై నందున అవార్డును మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ రాజు అందుకున్నారు. గ్రామ పంచాయతీల కేటగిరీలో అనకాపల్లి మండలం మార్టూరు గ్రామపంచాయతీ స్వచ్ఛ గ్రామపంచాయతీగా ఎంపికై ందున అవార్డును అనకాపల్లి ఎంపీడీవో ఆశాజ్యోతి, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు అందుకున్నారు. స్వచ్ఛ హాస్పిటల్ కేటగిరీలో అనకాపల్లి జీఏడీ ఆసుపత్రి ఎంపికై నందున ఆసుపత్రి తరఫున ఆయుష్ డాక్టర్ లావణ్య పురస్కారాలను అందుకున్నారు. స్వచ్ఛ హాస్టల్స్ కేటగిరీలో తాండవ ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాల స్వచ్ఛ హాస్టల్ అవార్డును పాఠశాల హెచ్‌ఎం విమలకుమారి, సంక్షేమ అధికారి మంగవేణి అందుకున్నారు. ఈ సందర్భంగా నాలుగు అవార్డులు సాధించిన సంస్థలు, అధికారులు, సిబ్బందికి కలెక్టర్ విజయకృష్ణన్ అభినందనలు తెలిపారు.


