విద్యా కమిటీ ఎన్నికల్లో టీడీపీ అరాచకాలు
ఓటు వేయాలని తల్లిదండ్రులకు బెదిరింపులు, నగదు పంపిణీ
స్థానిక ఎన్నిలను తలపించేలా శిబిరాల ఏర్పాటు
ఎమ్మెల్యే రాజు శిబిరాలు సందర్శించి టీడీపీ ప్రచారం
స్కూల్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ బరి తెగించింది. అధికార పార్టీ అభ్యర్ధులను గెలిపించాలని విద్యార్థుల తల్లిదండ్రులను బెదిరించారు. ఓటు వేయకపోతే మీ కుటుంబ సభ్యుల పింఛన్లు తొలగిస్తామని, ఇళ్లు మంజూరు చేయబోమని, పాఠశాల నుంచి మీ విద్యార్ధులను ఇళ్లకు పంపించేస్తామని భయభ్రాంతులకు గురి చేశారు.. అంతేకాకుండా డబ్బులు, చీరలు కూడా పంపిణీ చేసి తమకు అనుకూలంగా ఓటు వేసేలా ప్రలోభాలకు గురి చేశారు. వెరసి దేవాలయాల్లాంటి పాఠశాలలను రాజకీయ రొంపిలోకి దించడంపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమ పిల్లల భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారు.
బుచ్చెయ్యపేట : గత నెల 29న స్కూల్ కమిటీ ఎన్నికలు జరగ్గా ఆ రోజు వాయిదా పడిన 6 ఎస్‌ఎంసీ ఎన్నికలను తిరిగి శనివారం నిర్వహించారు. మేజర్ పంచాయతీ వడ్డాదిలో కోవెల అప్పనదొర జిల్లా పరిషత్ హైస్కూల్, కేజీబీవీ పాఠశాల వద్ద టీడీపీ నాయకులు స్ధానిక ఎన్నికలను తలపించేలా చెట్లు వేసి శిబిరాలు ఏర్పాటు చేశారు. ఓటు వేయకపోతే ప్రభుత్వ పథకాలు అందవని, మీ పిల్లలు ఇబ్బందులు పడతారని బెదిరింపులకు పాల్పడ్డారు. ఓటుకు రూ, 500 చొప్పున నగదు పంపిణీ చేశారు. సీతయ్యపేట, కరక, పీపీ అగ్రహారం తదితర గ్రామాల్లో టీడీపీ నాయకులు చీరలు పంపిణీ చేశారు. ఆర్.భీమవరంలో వైఎస్సార్‌సీపీకి, టీడీపీకి సమాన ఓట్లు రాగా అక్కడ అంగన్‌వాడీ టీచర్, ఆయా పోస్టులను ఇస్తామని ప్రలోభాలకు గురి చేసి దొడ్డిదారిలో గెలిచారు. స్వయంగా ఎమ్మెల్యే రాజుతో పాటు మండల టీడీపీ నాయకులు రెండు పాఠశాలల వద్ద శిబిరాల్లో పాల్గొని తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు కుయుక్తులు పన్నారు. హైస్కూల్, కేజీబీవీలో తమ అభ్యర్థులను గెలిపించేలా తల్లిదండ్రులను బెదిరింపులకు గురి చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్తకోట సీఐ కోటేశ్వరరావుతో పాటు ఇతర మండలాల ఎస్‌ఐలను, పోలీసు సిబ్బందిని పాఠశాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేసి విద్యా వ్యవస్థను కూడా రాజకీయ వ్యవస్థగా మార్చేశారని పలువురు తల్లిదండ్రులు ఆరోపించారు.
పెదపూడిలో వైఎస్సార్‌సీపీ బలపరిచిన గుమ్మిడి తలుపునాయుడు చైర్మన్, కోరుబిల్లి తులసి వైస్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. సీతయ్యపేట హైస్కూల్‌లో చైర్మన్‌గా నందవరపు సత్తిబాబు, వైస్ చైర్మన్‌గా చీపురపల్లి లక్ష్మి వైఎస్సార్‌సీపీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. వడ్డాది హైస్కూల్ చైర్మన్‌గా కోవెల వెంకట రమణ, వైస్ చైర్మన్‌గా భారతి, కేజీబీవీ చైర్మన్‌గా వెలుగుల వసంత, వైస్ చైర్మన్‌గా గాడి శ్రీను గెలుపొందారు. ఆర్.భీమవరంలో చైర్మన్‌గా రమణ, వైస్ చైర్మన్‌గా లావణ్య, చిన అప్పనపాలెంలో చైర్మన్‌గా మంగమ్మ, వైస్ చైర్మన్‌గా అప్పలనరస ఎన్నికయ్యారు.
మరోసారి ఎస్‌ఎంసీ ఎన్నికలు వాయిదా
అనకాపల్లి టౌన్ : జిల్లాలో మెత్తం 1432 ప్రభుత్వ పాఠశాలలో సెప్టెంబర్ 29న ఎస్‌ఎమ్‌సి ఎన్నికలు నిర్వహించగా, 1403 పాఠశాలలో ఎన్నికలు పూర్తి అయ్యాయి. మిగిలిన 29 పాఠశాలలో 50 శాతం కోరం పూర్తి కాకపోవడంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. వాయిదా పడిన 29 పాఠశాలల్లో శనివారం ఎన్నికలు నిర్వహించగా, ఇందులో 22 పాఠశాలల్లో ఎన్నికలు నిర్వహించారు. మిగిలిన ఆరు పాఠశాలలో ఎస్‌ఎంసీ ఎన్నికలు మరోసారి వాయిదా పడ్డాయని జిల్లా సమగ్రశిక్ష ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ శ్రీరాములు తెలిపారు.


