అమ్మకానికి గోవాడ సుగర్ ఫ్యాక్టరీ!
ఏపీఐఐసీకి పూర్తి హక్కులు కల్పిస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ
చరిత్రలో ఒక అధ్యాయంగా మిగలనున్న 64యేళ్ల గోవాడ ఫ్యాక్టరీ
24 వేల మంది రైతులు, కార్మికుల భవితవ్యం అగమ్యగోచరం
చంద్రబాబు ప్రభుత్వంపై మండిపాటు
ఫ్యాక్టరీ అమ్మకాన్ని అడ్డుకుంటామంటున్న అఖిలపక్షాలు, రైతు సంఘాలు
చోడవరం : చెరకు రైతుల ఉసురు తీసింది టీడీపీ కూటమి ప్రభుత్వం. రైతుల బకాయిలకు గ్రాంట్ రూపంలో నిధులు ఇచ్చి ఆదుకుంటుందనుకున్న ప్రభుత్వం చివరికి ఫ్యాక్టరీని మూసివేసే దిశగా, అమ్మకానికి అనువుగా ఆదేశాలు ఇచ్చింది. తమ కనుసన్నల్లో ఉన్న రాజకీయ వ్యాపారులకు ఫ్యాక్టరీని అప్పజెప్పేందుకు, ఏపీఐఐసీకి పూర్తి హక్కులు కల్పిస్తూ విడుదల చేసిన జీఓపై రైతు సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గెలిస్తే ఫ్యాక్టరీని అభివృద్ధి చేసి టన్నుకి రూ.4వేలు గిట్టుబాటు ధర ఇస్తామని ప్రగల్భాలు పలికిన కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీ ఇపుడు రైతులను నిండా మోస ం చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
దశాబ్దాలుగా తీపిని పంచి...
జిల్లాలో రైతులు చెరకు పంటతో తీపిని పంచి వేలాది మంది రైతులు, కూలీలు, కార్మికులకు జీవనాధారంగా ఉంటుందని 1962లో గోవాడ సుగర్ ఫ్యాక్టరీని స్థాపించారు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎక్కడా చెక్కుచెదరని ఆత్మ విశ్వాసంతో దినదినాభివృద్ధి చెందుతూ 24వేల మంది సభ్యరైతులు, 1500 మంది కార్మికులతో రోజువారీ క్రషింగ్ 1000 టన్నుల సామర్థ్యం నుంచి 5.25 లక్షల టన్నుల సామర్‌ాధ్యనికి విస్తరించింది. 2024 క్రషింగ్ సీజన్ వరకూ 62యేళ్లపాటు నిరాటకంగా పంచదార తయారీతో పాటు కోజనరేషన్ ప్లాంట్ ఏర్పాటు చేసుకొని కరెంటు ఉత్పత్తి చేసి సొంతానికి ఆ కరెంటును వినియోగిస్తూ మరో 50 లక్షలకు పైబడి యూనిట్లు విద్యుత్‌ను ఏపీఈపీడీసీఎల్‌కు అమ్ముతూ రాష్ట్రంలో అన్ని చక్కెర కర్మాగారాలకు ఒక దిక్సూచిలా గోవాడ సుగర్ ఫ్యాక్టరీ ఉండేది. అలాంటి ఫ్యాక్టరీకి 2013లో టీడీపీకి చెందిన పాలకవర్గం వచ్చి ఐదేళ్లపాలనలో సుమారు రూ. 130 కోట్లు వరకూ అప్పుల్లోకి తీసుకెళ్లారు.ఆ రోజు మొదలుకొని ఫ్యాక్టరీ అప్పుల ఊబిలోంచి బయటకు రాలేకపోయింది.
ఆదుకున్న వైఎస్సార్..ఊపిరి తీస్తున్న చంద్రబాబు
2004లో మహానేత రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక చెరకు మద్దతు ధర టన్నుకు అప్పటి వరకూ రూ.750 ఉండే ధరను రూ.1350–1846 పెంచి చెరకు రైతులను ఆదుకున్నారు. తర్వాత 2019లో వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రూ.90 కోట్లు వరకూ సాయం చేసి రైతులను, ఫ్యాక్టరీని ఐదేళ్లపాటు ఆదుకున్నారు. 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక్క రూపాయి కూడా సాయం ఇవ్వకపోగా పూర్తిగా ఫ్యాక్టరీ క్రషింగ్‌నే నిలిపివేశారు. రెండేళ్లుగా ఫ్యాక్టరీ మహాజనసభలు సైతం నిర్వహించలేదు. 2023–24 క్రషింగ్ సీజన్‌లో చెరకు సరఫరా చేసిన రైతులకు ఇప్పటి వరకూ చెరకు పేమెంట్స్ చేయలేదు.అంతేకాదు కార్మికులకు ఏడాదిగా జీతాలు కూడా ఇవ్వలేదు. రైతులకు కార్మికులకు కలిసి సుమారు రూ.29కోట్లు తక్షణం చెల్లించాల్సి ఉంది. ఇందుకోసం ఏడాదిగా రైతులు, కార్మికులు, రైతు సంఘాలు, ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తూనే ఉన్నాయి. అయినా ఇప్పటికీ బకాయిలు చెల్లించలేదు.
కార్మికులకు వీఆర్‌ఎస్‌లు ఇచ్చే దిశగా...
ఫ్యాక్టరీని ఏపీఐఐసీకి ఇచ్చేయడం, క్రషింగ్ చేయకుండా రెండేళ్లుగా మూసివేయడంతో ఇక కార్మికులు, సిబ్బందిని కూడా ఇంటికి పంపించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. వెయ్యి మంది కార్మికులు, సిబ్బందితో ఉండే ఈ ఫ్యాక్టరీలో కార్మికులను ఇప్పటికే విధులకు రానవసరంలేదని చెప్పగా పనిచేస్తున్న 50మంది యాజమాన్య సిబ్బందికి బలవంతంగా వీఆర్‌ఎస్ ఇచ్చి ఇంటికి పంపించేందుకు రంగం సిద్దం చేశారు.
ఫ్యాక్టరీ అమ్మకానికి అంతా సిద్ధం
రైతులకు చెల్లించాల్సిన రూ. 28.43 కోట్లు గ్రాంటు రూపంలోనో, వడ్డీలేని అప్పుగానో ఇచ్చి ఫ్యాక్టరీని నడిపించాల్సిన ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయలేదు. రైతులు, కార్మికుల పట్ల నిర్లక్ష్య ధోరణితో ప్రభుత్వం ఫ్యాక్టరీని ఏపీఐఐసీకి పూర్తి హక్కులతో అప్పగిస్తూ రూ. 250జీవోను కూడా విడుదల చేసింది. ఏపీఐఐసీ ఇచ్చిన డబ్బులతో రైతులకు బకాయిలు చెల్లిస్తున్నారు. అంటే ఫ్యాక్టరీని అమ్మేసి రైతులకు బకాయి డబ్బులు ఇస్తున్నారే తప్ప ప్రభు త్వం ఒక్క రూపాయి కూడా సాయం చేయలేదు. దీంతో 64యేళ్ల చరిత్ర ఉన్న గోవాడ సుగర్ ఫ్యాక్టరీ ఇక చరిత్రలో ఒక అధ్యాయంగా మిగిపోనుందనేది స్పష్టమవుతోంది.
ఫ్యాక్టరీ అమ్మకాన్ని
అడ్డుకుంటాం: రైతు సంఘాలు, ప్రతిపక్షాలు
చెరకు రైతుల సమస్యలు పట్టించుకోకుండా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అఖిలపక్ష పార్టీలు, రైతు సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. 24వేల మంది చెరకు రైతులు, కార్మికుల జీవితాలతో చెలగాడం ఆడితే సహించేది లేదని వారంతా ధ్వజమెత్తుతున్నారు. ఫ్యాక్టరీని మూసివేసి అమ్మేసే పరిస్థితి తెస్తే ఉద్యమానికి దిగుతామని ఇప్పటికే వైఎస్సార్‌సీపీ, సీపీఐ, సీపీఎం, చెరకు రైతు సంఘాలు, కార్మిక, రైతు కూలీసంఘాలు ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చాయి.
గోవాడ సుగర్ ఫ్యాక్టరీ
ఎన్నికల నాటి మాటలు..
నీటి మూటలు
ఎన్నికల ముందు చంద్రబాబు, పవన్‌కల్యాణ్, లోకేష్, స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు అంతా ఫ్యాక్టరీని ఆదుకుంటాం. ఆధునికీకరిస్తాం, చెరకు రైతులకు టన్నుకి రూ. 4వేటు గిట్టుబాటు ధర ఇస్తామని అనేక హామీలు ఇచ్చారు. వారంతా ఇప్పుడు ఫ్యాక్టరీపై నోరు మెదపడం లేదు. చోడవరం ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్ రాజు ఏకంగా చెరకు బదులు ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న వేసుకోండంటూ రైతులకు బహిరంగంగానే చెబుతున్నారు. ఇప్పుడు ఫ్యాక్టరీ మూతబడిపోయినా ప్రభుత్వంపై ఎటువంటి ఒత్తిడి తీసుకురాకుండా ఇటు రైతులకు , కార్మికులకు తీవ్ర అన్యాయమే చేశారు. క్షేత్రస్థాయిలో ఫ్యాక్టరీని నమ్ముకొని చెరకు పండించిన 24వేల మంది రైతులు, కార్మికుల మనుగడ ఏమిటనే ఆలోచన కూడా ప్రభుత్వం చేయకపోవడంపై రైతులు ఆగ్రహంతో ఉన్నారు.
తీయని మాటలతో..
నిండా ముంచారు
ఫ్యాక్టరీ గేటు వద్ద రైతులు, కార్మికుల ఆందోళన (ఫైల్)


