దేవరాపల్లి: ప్రజల సమస్యలు పరిష్కరించా లని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం దేవరాపల్లిలో జైలు భరో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు రైతు సంఘం జిల్లా కోశాధికారి గండి నాయనబాబు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బి.టి. దొర తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను శనివారం వారు ఆవిష్కరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 10న నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు, జైలు భరో చేపట్టాలని ప్రజా సంఘాలు నిర్ణయం తీసుకున్నాయని చెప్పారు. మాడుగుల నియోజకవర్గానికి సంబంధించి దేవరాపల్లిలో జైలు భరో నిర్వహిస్తామని, కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, గిరిజనులు, దళితులు, వృత్తిదారులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అంగన్‌వాడీ, ఆశా, మిడ్ డే మీల్స్, వీవోఏ, సమగ్ర శిక్ష తదితర స్కీమ్ వర్కర్లకు కనీస వేతనం రూ. 31 వేలు ఇవ్వాలని, కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలని, కరువు సహాయక చర్యలు చేపట్టాలని, ఉచిత పంటల బీమా అమలు చేయాలని, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమాలను చేపడుతున్నట్టు చెప్పారు.


