అనకాపల్లి: ఆటో కార్మికుల యూనియన్ నాలుగో రాష్ట్ర మహాసభలను విశాఖలో ఈనెల 20, 21 తేదీల్లో నిర్వహించనున్నట్టు ఆటో అండ్ మోటార్ ట్రాన్స్‌పోర్టు వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షుడు వై.ఎన్.భద్రం తెలిపారు. స్థానిక రైల్వే స్టేషన్ రహదారి నాయుళ్లవీధిలో రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్లను శనివారం ఆయన ఆవిష్కరించి, మాట్లాడారు. పోలీసు, రవాణాశాఖ అధికారులు ఈ–చలానా పేరుతో ఆటోకార్మికులను దోచుకుంటున్నారు. ఇ– ఆటోలను ప్రవేశపెట్టి ఆర్టీసీ ద్వారా నడపాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడం దుర్మార్గమన్నారు. ఇదే విధంగా మన రాష్ట్రంలో జరిగితే లక్షలాదిమంది ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవడం తప్పదని చెప్పారు. ఆటో కార్మికలకు వ్యతిరేకంగా జారీచేసిన జీవో నంబర్ 21, 31 లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ అనకాపల్లి అధ్యక్షుడు శ్రీరామదాసు అబ్బులు, సీపీఐ పట్టణ కార్యదర్శి తాకాసి వెంకటేశ్వరరావు, ఎం.కుమారస్వామి, ఒమ్మిశ్రీను, శంకర్, వెంకట అప్పారావు, మెల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు.


