కన్నీటి సంద్రంలో
గుండెల్ని పిండేసిన జబ్బర్‌తోట.. గంగపుత్రుల గుమ్మం ముందు ‘నేనున్నా’ అన్న జగన్
బోటు ప్రమాద బాధితులను ఓదార్చి కొండంత ధైర్యం చెప్పిన మాజీ సీఎం బాధిత కుటుంబాలకు వైఎస్సార్‌సీపీ తరఫున రూ.7 లక్షల చొప్పున సాయం బాధితులకు ప్రభుత్వం రూ.కోటి పరిహారం, కొత్త బోటు ఇవ్వాలని డిమాండ్ విమానాశ్రయం నుంచి జబ్బర్‌తోట వరకు అడుగడుగునా ప్రజా నీరాజనం
బుధవారం శ్రీ 15 శ్రీ జూలై శ్రీ 2026
మత్స్యకార బాధిత కుటుంబీకులను ఓదార్చి ఽధైర్యం చెబుతున్న మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి
సాక్షి, విశాఖపట్నం: సముద్రం గర్భంలో తమ సర్వస్వాన్ని కోల్పోయి, గుండె కోతతో విలపిస్తున్న మత్స్యకార పల్లెకు ఆయనే ఒక ఓదార్పు నావలా నిలిచారు. పది రోజులుగా కన్నీరే తాగుతూ.. ఆకలి నకనకలతో దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ పేద కుటుంబాల చెంతకు చేరి, ‘నేనున్నాను.. అధైర్యపడకండి’ అంటూ కొండంత ఆశ కల్పించారు. విశాఖపట్నం జబ్బర్‌తోట బోటు ప్రమాద బాధితులను పరామర్శించేందుకు మంగళవారం విచ్చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి నగర ప్రజలు, మత్స్యకార శ్రేణులు అపూర్వ నీరాజనం పలికాయి. ఎయిర్‌పోర్టు నుంచి జబ్బర్‌తోట వరకు దారిపొడవునా రహదారులు జనసందోహంతో కిక్కిరిసిపోయాయి.
పోలీసుల ఆంక్షలు.. ప్రజల వెల్లువ
జననేతను చూడకుండా చేసేందుకు పోలీసులు ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టి, వీధులను బంధించి ఆంక్షల ప్యూహాలు పన్నినా.. వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ జనప్రవాహం ఉప్పెనలా కదలివచ్చింది. మూడు గంటల పాటు సాగిన ఈ పర్యటనలో ఒక్కొక్కరినీ పేరుపేరునా పలకరిస్తూ, వారి చేతులు పట్టుకుని వైఎస్ జగన్ ఇచ్చిన భరోసా ఆ ఇరుకు సందుల్లో పోయిన ధైర్యాన్ని తిరిగి తెచ్చింది. ‘మా బాధ వినే నాథుడే లేడనుకున్న వేళ.. దేవుడిలా మా గుమ్మం ముందుకు వచ్చావు జగనన్నా‘ అంటూ మత్స్యకారులు ఆయన కాళ్లకు సాష్టాంగ నమస్కారం చేస్తూ కన్నీరుమున్నీరయ్యారు.
కన్నీటి గుమ్మాల్లో ఆత్మీయ ఓదార్పు
జబ్బర్‌తోటలోకి అడుగుపెట్టిన తర్వాత పర్యటన పూర్తిగా భావోద్వేగంగా మారింది. బోటు ప్రమాదంలో గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల కుటుంబాలను ఒక్కొక్కరిగా పరామర్శించిన జగన్, వారి చేతులు పట్టుకుని ఓదార్చారు. పది రోజులుగా తమ గుమ్మం వైపు ప్రభుత్వం నుంచి ఎవరూ రాలేదన్న బాధను కుటుంబ సభ్యులు కన్నీటి మధ్య వివరించారు. వారి ఆవేదనను ఓపిగ్గా విన్న జగన్.. ‘అధైర్యపడొద్దు... మీకు నేనున్నా‘ అంటూ ధైర్యం చెప్పారు.
కారి చిన్నా గాథతో చలించిన జననేత
మృత్యువుతో పోరాడి ప్రాణాలు నిలుపుకున్న కారి చిన్నాతో జరిగిన సంభాషణ పర్యటనలో అత్యంత హృదయవిదారకంగా నిలిచింది. తుఫాను అలల్లో బోటు మునిగిపోవడం.. తోటి వారంతా కళ్లముందే సముద్రంలో కలిసిపోవడం.. తాను 15 కిలోమీటర్లు ఈదుకుంటూ వెళ్లి చైనా నౌక యాంకర్‌ను పట్టుకుని బతికిన తీరును వివరిస్తూ చిన్నా భావోద్వేగానికి గురయ్యాడు. ‘అధికారులు సమయానికి వచ్చి ఉంటే మా వాళ్లు బతికేవారు అన్నా‘ అని అతడు చెప్పిన మాటలు అక్కడున్న వారిని కలిచివేశాయి. అతడిని హత్తుకున్న జగన్.. కొత్త బోటుతో పాటు పూర్తి నష్టపరిహారం అందేలా కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.
కన్నీళ్లతో గుండెలు పిండేసిన మహిళలు
భర్త సముద్రంలో గల్లంతై, రెండేళ్ల చిన్నారితో మిగిలిపోయిన దమయంతి.. ‘ఇప్పుడు ఎలా బతకాలన్నా?‘ అంటూ బోరున విలపించింది. మరో బాధితురాలు నర్సియమ్మ... ‘నా భర్త ఉన్నాడో, లేడో కూడా ప్రభుత్వం చెప్పడం లేదు‘ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ముగ్గురు కుమార్తెల భవిష్యత్తుపై లక్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది. ప్రతి ఇంట్లోనూ ఒకే మాట వినిపించింది.. ‘ప్రభుత్వం నుంచి ఎవరూ రాలేదు.. మీరు మాత్రం ఇచ్చిన మాట ప్రకారం వచ్చారు.‘ ఆ బాధను విన్న జగన్ కుటుంబ సభ్యులను హత్తుకుని ధైర్యం చెప్పారు.
భరోసాతో పాటు చేయూత
బాధిత కుటుంబాల ఆవేదన విన్న వెంటనే వైఎస్సార్‌సీపీ తరఫున గల్లంతైన ఆరుగురు కుటుంబాలతో పాటు ప్రాణాలతో బయటపడిన కారి చిన్నా కుటుంబానికీ కలిపి మొత్తం ఏడు కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.7 లక్షల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు. ప్రభుత్వం స్పందించకపోతే భవిష్యత్తులో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ఒక్కో కుటుంబానికి రూ.కోటి పరిహారం, కొత్త బోటు, పిల్లల చదువు బాధ్యతను కూడా స్వీకరిస్తామని హామీ ఇచ్చారు.
చల్లంగ ఉండు నాయనా..
మోకాళ్లపై అభిమానులు
జగనన్నకు జయ జయ ధ్వానాలు
జగనన్న వచ్చాడురోయ్
కన్నీళ్లు కట్టలు తెంచుకున్నాయి.. గుండెల్లో దాచుకున్న బాధ ఒక్కసారిగా పొంగిపొర్లింది. ‘మా గుమ్మం వైపు ఎవరూ చూడలేదు.. మీరు మాత్రం వచ్చారు‘ అంటూ మత్స్యకార కుటుంబాలు బోరున విలపించాయి. ‘అధైర్యపడొద్దు.. నేనున్నా’ అంటూ ఒక్కొక్కరిని హత్తుకున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. కన్నీటి గుమ్మాలకు కొండంత భరోసా ఇచ్చారు. తన వాళ్ల కోసం ఎదురుచూస్తున్న తల్లులు, భర్త కోసం విలపిస్తున్న భార్యలు, తండ్రి కోసం అమాయకంగా చూస్తున్న చిన్నారులను ఒక్కొక్కరిని పలకరిస్తూ ధైర్యం చెప్పారు. ప్రభుత్వం తమను పట్టించుకోలేదన్న వేదనను విన్న ప్రతిపక్ష నేత.. బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని, న్యాయం జరిగే వరకు పోరాడతానని భరోసా ఇచ్చారు.


