ఇసుక తరలింపులో రెండు వర్గాల మధ్య వివాదం
ఇరువర్గాలు బాహా బాహీ
ఇరువర్గాలతో వేర్వేరుగా పోలీస్‌ల చర్చలు
తాత్కాలికంగా సద్దుమణిగిన వివాదం
పోలీసు సమక్షంలోనే బాహాబాహీకి దిగిన
టీడీపీకి చెందిన ఇరువర్గాలు
టీడీపీ ఇరువర్గాలతో చర్చిస్తున్న స్థానిక ఎస్‌ఐ సత్యనారాయణ
దేవరాపల్లి: మండలంలోని తిమిరాం టీడీపీలోని రెండు వర్గాల మధ్య మంగళవారం ఇసుక దుమారం చెలరేగింది. శారదా నది నుంచి ఇసుక తరలించే విషయంలో రెండు వర్గాల మధ్య విభేదాలు తలెత్తాయి. వీరి వర్గ విభేదాలు తారా స్థాయికి చేరడంతో ఇరువర్గాల వారు బాహాబాహీకి దిగారు. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న ఎస్‌ఐ వి.సత్యనారాయణ తన సిబ్బందితో కలిసి అక్కడి చేరుకున్నారు. పోలీసుల సమక్షంలోనే మరోమారు ఇరువర్గాలు తోపులాటలకు దిగేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి అదుపు దాటుతుందని గమనించిన స్థానిక ఎస్‌ఐ సత్యనారాయణ అదనపు పోలీస్ సిబ్బందిని తిమిరాంకు రప్పించారు. ఎ. కోడూరు ఎస్‌ఐ సంతోష్‌కుమార్ సైతం తిమిరాం చేరుకున్నారు. ఈ వివాదానికి సంబంధించి స్థానికుల కఽథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన ఉచిత ఇసుక పాలసీని అదనుగా చేసుకొని శారదానది పరివాహక ప్రాంతాల్లో రాత్రి, పగలు తేడా లేకుండా అక్రమంగా ఇసుక తవ్వకాలు చేపడుతూ కొందరు భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. తిమిరాం వంతెనకు సమీపంలో కొందరు, వారపు సంతకు సమీపంలో మరికొందరు నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు చేపట్టి భారీగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ విషయంలోనే ఇరువర్గాల మధ్య వివాదం చెలరేగింది. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇరువర్గాల వారు ఘర్షణకు దిగారు. దీంతో మంగళవారం ఉదయం కూడా ఇరువర్గాల వారు ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను అడ్డగించుకోవడంతో మరోమారు వివాదం తలెత్తెంది. ఇరువర్గాల వారు అరుపులు కేకలతో భౌతిక దాడులకు దిగారు. ఈ విషయం తెలుసుకొని అక్కడికి చేరుకున్న దేవరాపల్లి, ఎ. కోడూరు ఎస్‌ఐలు ఇరువర్గాల వారితో వేర్వేరుగా సుమారు 2 గంటల పాటు సుదీర్ఘ చర్చలు జరిపి సుముదాయించడంతో వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది. వెరసి గ్రామంలో కొంత కాలంగా నివురు గప్పిన నిప్పులా ఉన్న టీడీపీ వర్గ విభేదాలు ఇసుక తరలింపు విషయంలో ఒక్కసారిగా భగ్గుమన్నాయి.


