తుమ్మపాల : కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్ల పూర్తి అయినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేయడంలో విఫలమైందని, దశల వారిగా ఉద్యమాలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వానికి చీమకుట్టినట్టు అయినా లేకుండా పోయిందని ఫ్యాఫ్టో జిల్లా డిప్యూటీ ప్రధాన కార్యదర్శి గొంది చిన్నబ్బాయ్ అన్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద మంగళవారం సాయంత్రం ధర్నా చేసి, పట్టణంలో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీఆర్సీని తక్షణమే అమలు చేయాలని అంతవరకూ ఐఆర్‌ను అమలు చేయాలని, బకాయిపడ్డ నాలుగు డీఏలు చెల్లించాలన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి జూలై నెలాఖరుకు రెండు సంవత్సరాలు పూర్తి అవుతుందని, ఇదే ఒరవడి కొనసాగితే ఉద్యోగులు తీవ్రంగా నష్ట పోతారన్నారు. ఉద్యోగులు ఆలస్యంగా డ్యూటీకి వెళ్తే ప్రభుత్వం ఒప్పుకోనట్లే, ప్రభుత్వం ఆలస్యంగా పీఆర్సీలు ఇవ్వడాన్ని ఉద్యోగులు కూడా ఒప్పుకోరని ఆయన పేర్కొన్నారు. నాలుగు విడతల కరువు భత్యం ప్రభుత్వం బకాయి పడిందని, వాటిని వెంటనే విడుదల చేయాలని ఆయన కోరారు. దశల వారీగా ఉద్యమాలు నిర్వహించి, త్వరలో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేసి వినతిపత్రం అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్యాప్టో నాయకులు చిన్నారావు, సుధాకర్, వై. శ్రీనివాసరావు, ఆళ్ల శేఖర్, మట్టా శ్రీను పాల్గొన్నారు.


