● ఎఫ్‌పీవో సీఈవో హనుమంతరావు
జి.మాడుగుల: గిరిజన రైతులు పండిస్తున్న పంటలకు గిట్టుబాటు ధర ఎఫ్‌పీవో కల్పించడం జరుగుతుందని ఎఫ్‌పీవో సీఈవో ఐసరం హనుమంతరావు అన్నారు. మండలంలోని సొలభం సచివాలయం–1లో శుక్రవారం శ్రీ మత్స్యదేవత ఎఫ్‌పీవో ఆధ్వర్యంలో వార్షిక సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన అజెండాను చదివి సభ్యులకు ఆయన వివరించారు. వర్మీకంపోస్ట్ పిట్స్, సోయిల్ టెస్టింగ్ కిట్స్, నాణ్యమైన చిరుధాన్యాల విత్తనాలు పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. గత సమావేశంలోని మినిట్స్‌ను ధృవీకరించి, ఆ నిర్ణయాలపై తీసుకున్న చర్యలను సమీక్షించారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి ఆడిటర్‌ను నియమించడం, వర్తించే నిబంధనల ప్రకారం ఆడిట్ ఫీజు ఆమోదం, అవసరమైన చోట బోర్డు ఆఫ్ డైరెక్టర్ల ఎన్నిక, పునర్వ్యవస్థీకరణ, ఖాళీ స్థానాలు భర్తీ చేయడం, ఐఐఎంఆర్, ఐసీఐసీఐ ఫౌండేషన్ ఇచ్చిన మిల్లెట్స్ ప్రాసెసింగ్ యూనిట్‌పై చర్చ జరిగింది. ప్రతినిధి సర్వసభ్య సమావేశంలో పాల్గొనేందుకు ఎఫ్‌ఐజీ ప్రతినిధులను ధ్రువీకరించడం, 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వ్యాపార ప్రణాళికను, దాని ప్రాధాన్యతలు, లక్ష్యాలతో సహా సమీక్షించి ఆమోదించడం, ఉత్పత్తుల సేకరణ, ప్రొసెసింగ్, విలువ జోడింపు, బ్రాండింగ్, ప్యాకేజింగ్, మార్కెటింగ్ ద్వారా ఎఫ్‌పీవోను బలోపేతం చేయడం, రైతుల ఆదాయాన్ని పెంచడంపై చర్చించారు. కాఫీ బోర్డు పథకాలు, సబ్సిడీలు, అర్హత కలిగిన పథకాలపై సమీక్ష, తదితర అంశాలపై చర్చించారు.


