గిరి గ్రామాలు అతలాకుతలం | - | Sakshi
Sakshi News home page

గిరి గ్రామాలు అతలాకుతలం

Sep 26 2026 12:56 AM | Updated on Sep 26 2026 12:56 AM

● పలుచోట్ల కూలిన చెట్లు ● గంగవరం వంతెన దాటేందుకు అష్టకష్టాలు ● పలుచోట్ల కోతకు గురైన రహదారులు

సాక్షి,పాడేరు/సీలేరు: జిల్లా ఏజెన్సీ ఆంధ్ర–ఒడిశా సరిహద్దులోని జీకే వీధి మండలంలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఈ భారీ వర్షాలకు అనేక గ్రామాలు వరద ముంపులో చిక్కుకుపోయాయి. పంటలు కొట్టుకుపోయాయి. ధారకొండ పంచాయతీ గంగవరం వంతెనపై వరద ఉధృతి పెరగడంతో అవతలి ఒడ్డున ఉన్న గర్భిణులను తాళ్ల సాయంతో గిరిజనులు దాటించారు. పెట్రాయి గ్రామంలో అంబులెన్స్‌ మట్టిలో చిక్కుకుపోవడంతో ట్రాక్టర్‌తో బయటకు తీశారు. ఈలోపు గర్భిణికి గ్రామంలోనే ప్రసవం జరగడం స్థానికుల్లో ఆందోళన కలిగించింది. గాలికొండ పంచాయతీ బొచ్చుకొండ రోడ్డులో వేసిన గ్రావెల్‌ రహదారి పూర్తిగా కొట్టుకుపోయింది. సీలేరు గ్రామంలో రెండో క్రాస్‌ రోడ్డులో భారీ చింత చెట్టు కూలిపోవడం, రెగ్యులేటర్‌ డ్యామ్‌ నుంచి పవర్‌హౌస్‌ మార్గంలో నీటి ప్రవాహం పెరగడం వల్ల రాకపోకలకు ఆటంకం కలిగింది. దుర్గా వీధిలో కాల్వలు లేకపోవడంతో వర్షపు నీరు ఇళ్ల మధ్య నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ధారకొండ పంచాయతీ నిమ్మచెట్టు ప్రాంతంలో నాలుగు రోజులుగా వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తూ నిత్యావసర సరకుల సరఫరా నిలిచిపోయింది. దారాలమ్మ ఘాట్‌ రోడ్డులో కొండచరియలు జారిపడటంతో విశాఖపట్నం–భద్రాచలం మార్గంలోని కొన్ని బస్సులు రద్దయ్యాయి. ప్రస్తుతం వర్షాలు తగ్గినా, వరద ప్రవాహం మాత్రం కొనసాగుతుండటంతో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు.

1176 మిల్లీమీటర్ల వర్షం

జిల్లా వ్యాప్తంగా 1176.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అత్యధికంగా గూడెంకొత్తవీధి మండలంలో 154.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముంచంగిపుట్టు 146.2, పెదబయలు 117.6, డుంబ్రిగుడ 86.2, అరకులోయ 95.4, అనంతగిరి 94.4, హుకుంపేట 80.6, పాడేరు 53.2, జి.మాడుగుల 123.2, చింతపల్లి 143.2, కొయ్యూరు 82.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

మన్యంలో కొనసాగిన వర్షాలు

వాయుగుండం ప్రభావంతో మన్యంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా కేంద్రం పాడేరులో శుక్రవారం ఉదయం నుంచి వర్షం పడుతూనే ఉంది. పాడేరు వారపు సంత కొనుగోలుదారులు లేక వెలవెలబోయింది. అన్ని మండలాల్లోనూ వర్షాలు పడుతుండడంతో జనజీవనం స్తంభించిపోయింది. ఎక్కడికక్కడ కొండవాగులు, గెడ్డల్లో వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రధాన మత్స్యగెడ్డ పొంగి పొర్లుతుంది. దీంతో వందలాది మారుమూల గ్రామాలకు రవాణా వ్యవస్థ దెబ్బతింది. దారకొండ, పాడేరు ఘాట్‌ రోడ్లలో కొండచరియలు, చెట్లు నేలకూలడంతో వాహనాల రాకపోకలకు కొంత అంతరాయం కలిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement