భారీ వర్షాలతో ప్రమాద స్థాయికి జలాశయాలు
డొంకరాయి, గుంటవాడలలో అర్ధరాత్రి గేట్ల ఎత్తివేత
సీలేరు కాంప్లెక్స్‌లో అప్రమత్తమైన జెన్‌కో అధికారులు
నిండుకుండల్లా
సీలేరు: మొన్నటి వరకు నీరు లేక వెలవెలబోయిన సీలేరు కాంప్లెక్స్ పరిధిలోని ప్రధాన జలాశయాలు తాజాగా కురిసిన భారీ వర్షాలకు నిండుకుండల్లా కళకళలాడుతున్నాయి. ఎగువ నుంచి భారీగా చేరుతున్న వరదనీటితో నీటి మట్టాలు ఒక్కసారిగా పెరిగాయి. అర్ధరాత్రి సమయంలోనే జెన్‌కో అధికారులు అప్రమత్తమై గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.
డొంకరాయి జలాశయం
డొంకరాయి పూర్తి స్థాయి నీటి మట్టం 1037 అడుగులు కాగా, వలసగెడ్డ, పాలగెడ్డ, మంగపాడు వాగుల నుంచి సుమారు 95,500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో చేరింది. దీంతో గురువారం అర్ధరాత్రి నీటి మట్టం 1036.50 అడుగులకు చేరింది. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని రాత్రి 2 గంటల సమయంలో ఏడు గేట్లు ఎత్తి 1,02,857 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అనంతరం తెల్లవారుజామున నీటి మట్టం 1034.50 అడుగులకు తగ్గడంతో విడుదలను 36,144 క్యూసెక్కులకు తగ్గించారు. ఈ స్థాయిలోనే విడుదల కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
గుంటవాడ జలాశయం
వారం రోజుల క్రితం నీరు లేక వెలవెలబోయిన సీలేరు కాంప్లెక్సులోని గుంటవాడ జలాశయం భారీ వర్షాలతో నిండిపోయింది. నీటి మట్టం 1360 అడుగులు కాగా.. పిల్లిగెడ్డ, ఐస్‌గెడ్డ, కంపెనీ కాలువల నుంచి సుమారు 21,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రావడంతో నీటి మట్టం 1558.10 అడుగులకు చేరింది. దీంతో రెండు గేట్లు ఎత్తి 3,700 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తూ స్థిరంగా ఉంచుతున్నారు. ఈఈ అప్పలనాయుడు, ఏడీ జైపాల్ పర్యవేక్షణలో చర్యలు కొనసాగుతున్నాయి.
బలిమెల జలాశయం
బలిమెల పూర్తి స్థాయి 1516 అడుగులు కాగా, ప్రస్తుతం 1494.50 అడుగులకు నీటి మట్టం పెరిగింది. గత మూడు రోజులుగా 1,06,381 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో చేరుతోంది. పూర్తి స్థాయికి చేరడానికి ఇంకా 21.50 అడుగులు అవసరం.
జోలాపుట్ జలాశయం
జోలాపుట్ పూర్తి స్థాయి 2750 అడుగులు కాగా, ప్రస్తుతం 2743.40 అడుగులకు చేరుకుంది. 43,490 క్యూసెక్కుల ఇన్‌ఫ్లోతో నీటి మట్టం వేగంగా పెరుగుతోంది. పూర్తి స్థాయికి చేరేందుకు ఇంకా 6.60 అడుగులు మాత్రమే మిగిలి ఉన్నాయి.


