సీలేరు: భారీ వర్షాలతో రాకపోకలు నిలిచిపోయిన గూడెంకొత్తవీధి మండలంలో ఓ నిండు గర్భిణిని జిల్లా యంత్రాంగం సకాలంలో స్పందించి ప్రాణాపాయం నుంచి కాపాడింది. అడవి మార్గంలో అంబులెన్స్ సాయంతో తరలించి ఆస్పత్రికి చేర్చడంతో ఆమెకు సుఖ ప్రసవం జరిగి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గూడెంకొత్తవీధి మండలంలోని గిరిజన గ్రామాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. గంగవరం వంతెన కొట్టుకుపోవడంతో ఎనిమిది గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ పరిస్థితుల్లో పెట్రాయి గ్రామానికి చెందిన సుందరమ్మ అనే గర్భిణికి అర్ధరాత్రి ప్రసవ వేదనలు మొదలయ్యాయి. ఆమెను బయటకు తీసుకువచ్చినప్పటికీ వరదలు, వంతెన దెబ్బతినడం వల్ల ఆస్పత్రికి తరలించే పరిస్థితి లేకపోయింది. ఈ విషయాన్ని ఆశా సిబ్బంది స్థానిక వైద్యాధికారికి తెలియజేయగా, అక్కడి నుంచి జిల్లా వైద్యాధికారికి సమాచారం చేరింది. దీనిపై కలెక్టర్ నిశాంతి తక్షణమే స్పందించి గర్భిణిని ఎలాగైనా రక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే హెలికాప్టర్ సాయంతో తరలించాలని కూడా సూచించారు. వెంటనే తహసీల్దార్ అన్నాజీరావు, వీఆర్వో, సిబ్బంది రంగంలోకి దిగి ప్రత్యేక చర్యలు చేపట్టారు. అంబులెన్స్‌ను సీలేరు రిజర్వాయర్ పైనుంచి బలిమెల–చిత్రకొండ అడవి మార్గం మీదుగా గ్రామానికి తీసుకొచ్చారు. అప్పటికే తీవ్ర నొప్పులతో బాధపడుతున్న గర్భిణిని ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం సురక్షితంగా బయటకు తీసుకువచ్చి అంబులెన్స్‌లో ఒడిశా మార్గం ద్వారా దారకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఆస్పత్రికి చేరుకున్న కొద్దిసేపటికే సుందరమ్మ సుఖంగా ప్రసవించి మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో గ్రామస్తులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. గర్భిణి ప్రాణాలను కాపాడిన కలెక్టర్, తహసీల్దార్, వైద్య సిబ్బంది, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం సేవలను పలువురు అభినందించారు.


