ప్రచారానికి కోట్లా! | - | Sakshi
Sakshi News home page

ప్రచారానికి కోట్లా!

Sep 26 2026 12:56 AM | Updated on Sep 26 2026 12:56 AM

సోషల్‌ మీడియా పాలసీ తీసుకొచ్చిన కూటమి ప్రభుత్వం

నిరుద్యోగులకు నిరాశ.. ఇన్‌ఫ్లుయెన్సర్లకు వేతనాలా?

చంద్రబాబు ప్రభుత్వంపై సర్వత్రా ఆగ్రహం

ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ హామీల అమల్లో జాప్యం చేస్తూ, మరోవైపు ప్రభుత్వ ప్రచారం కోసం సోషల్‌ మీడియా పాలసీ తీసుకొచ్చిన కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి వంటి కీలక హామీలు నెరవేర్చకపోవడంపై యువత, మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు వేతనాల పేరిట ‘పచ్చ’దందాకు తెరలేపడంపై మండిపడుతున్నారు.
హామీలు గాలికి..

సాక్షి,పాడేరు: గత సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో సూపర్‌సిక్స్‌ హామీలు ఇచ్చిన ప్రస్తుత సీఎం చంద్రబాబు వాటిని పూర్తి స్థాయిలో అమలు చేయకుండా ప్రజలకు టోకరా పెట్టారు. జిల్లాలోని అర్హులైన ప్రజలంతా సూపర్‌సిక్స్‌ హమీలపై రెండున్నరేళ్లుగా ఎదురుచూస్తున్నా ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదు. ఇప్పుడు టీడీపీ సోషల్‌ మీడియాకు ప్రభుత్వ పథకాల ప్రచారం పేరిట రూ.కోట్ల నిధులు దోచే పెట్టేందుకు చంద్రబాబు సర్కారు సోషల్‌ మీడియా పాలసీ తీసుకురావడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇన్‌ఫ్లుయెన్సర్లకు ప్రభుత్వ వేతనాలా?

ప్రభుత్వ ధనంతో ఇన్‌ఫ్లుయెన్స్‌ ఎంప్లాయిమెంట్‌ పాలసీ అమలుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవ్వడంపై నిరుద్యోగులు కూడా మండిపడుతున్నారు. టీడీపీ సోషల్‌ మీడియా, కూటమి ప్రభుత్వానికి బాజాలు కొట్టే కార్యకర్తలకు ప్రతి నెలా వేతనాలు ఇచ్చే పాలసీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వ పథకాల ప్రచారం పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే చర్యలను మేధావులతో పాటు నిరుద్యోగ, యువజన సంఘాలు కూడా ఖండిస్తున్నాయి.

భృతి.. బ్రాంతియేనా?

కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు చంద్రబాబుతో పాటు కూటమి నేతలంతా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కల్పిస్తామని ఎన్నికల ప్రచారం చేశారు. సూపర్‌ సిక్స్‌లో ఈ పథకం కూడా ఉంది. రెండున్నరేళ్లలో నిరుద్యోగ యువతను వంచించారు. నిరుద్యోగ భృతి కోసం జిల్లాలో అర్హులైన సుమారు లక్ష మంది వరకు యువతీ, యువకులు ఎదురుచూస్తున్నారు.

50 ఏళ్లకు పింఛన్‌.. హుళక్కేనా?

సూపర్‌సిక్స్‌ హామీలో భాగమైన 50 ఏళ్లకు పింఛన్‌ మంజూరును కూడా కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసింది. అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నరేళ్లలో ఒక్క కొత్త పింఛన్‌ కూడా అర్హులకు ఇవ్వలేదు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఇటీవల కొత్త పింఛన్లకు దరఖాస్తులు మాత్రం స్వీకరించారు. వాటికి కొత్త నిబంధనలతో అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తున్నారు. అటువంటిది 50 ఏళ్లు దాటిన వారు అధికంగా ఉండడంతో ఈ పథకం అమలుపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఆడబిడ్డ నిధి ఎప్పుడు?

అధికారంలోకి రాగానే ఆడబిడ్డ నిధి పేరుతో 18 ఏళ్లు దాటిన మహిళలకు నెలకు రూ.1500 సాయం చేస్తానన్న చంద్రబాబు మాటలు కూడా ఉత్తిదేనని తేలిపోయింది. ఆడబిడ్డ నిధికి జిల్లాలో సుమారు లక్షా 50వేల మంది వరకు అర్హులైన మహిళలు ఎదురు చూస్తున్నారు. ప్రతి నెల రూ. 1500 అందుకుందాం అని ఆశపడిన మహిళా లోకానికి సీఎం చంద్రబాబు ఝలక్‌ ఇచ్చారు. పథ కాల అమలుకు ముందుకు రాని కూటమి ప్రభుత్వం.. టీడీపీ సోషల్‌ మీడియాకు మాత్రం వేలకు వేలు వేతనాలు చెల్లించేందుకు కొత్త పాలసీ తీసుకురావడంపై మహిళలు కూడా ఖండిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement