జనజీవనం | - | Sakshi
Sakshi News home page

జనజీవనం

Sep 13 2026 1:00 AM | Updated on Sep 13 2026 1:00 AM

స్తంభించిన

సీలేరు: జిల్లాలోని సీలేరు ఏజెన్సీ సరిహద్దు నుంచి ఒడిశా వెళ్లే రెండు ప్రధాన రహదారుల్లో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. గురువారం సాయంత్రం నుంచి సరిహద్దు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ఈ పరిస్థితి నెలకొంది. అధికారులు స్పందించకపోవడంతో శనివారం తెల్లవారుజాము నుంచి ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

కొట్టుకుపోయిన గంగవరం వంతెన

దారకొండ పంచాయతీ గంగవరం రహదారిలోని తాత్కాలిక తూరల వంతెన వరద ధాటికి కొట్టుకుపోయింది. ఏడాదిన్నర కిందట ఇక్కడ వంతెన కొట్టుకుపోవడంతో గిరిజనులే స్వయంగా దీనిని నిర్మించుకున్నారు. ఇప్పుడు అది కూడా కొట్టుకుపోవడంతో ఒడిశా వైపు వెళ్లే మార్గంలో సుమారు 30 గ్రామాల ప్రజలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.

పిల్లిగెడ్డ అప్రోచ్‌ రోడ్డు ధ్వంసం

ఆంధ్రా, ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ, ఒడిశాలను కలిపే సీలేరు సమీప పిల్లిగెడ్డ వంతెన అప్రోచ్‌ రోడ్డు భారీ గోతులు పడి బురదమయంగా మారింది. శనివారం ఉదయం వాహనాలు బురదలో కూరుకుపోవడంతో ఇరువైపులా రాకపోకలు నిలిచిపోయి అంతర్రాష్ట్ర ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. అధికారులు ఎవరూ రాకపోవడంతో ఎస్‌ఐ యాసి న్‌ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఉధృతంగా ప్రవహిస్తున్న గంగవరం గెడ్డను ఎవరూ దాటవద్దని, అత్యవసర సమయాల్లో సీ లేరు పోలీస్‌ స్టేషన్‌ను సంప్రదించాలని సూచించారు. ఇలావుండగా పిల్లిగెడ్డ వంతెనకు సీసీ అప్రోచ్‌ రోడ్డు వేయాలని, గంగవరం వద్ద శాశ్వత వంతెన నిర్మించాలని విన్నవిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని గిరిజనులు మండిపడుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు చేపడతామని ఆంధ్రప్రదేశ్‌ గిరిజన సమాఖ్య జిల్లా అధ్యక్షుడు పాంగి నాగేశ్వరరావు హెచ్చరించారు.

కూలిన చెట్టు.. నిలిచిన రాకపోకలు

సీలేరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని దుప్పులువాడ వద్ద శనివారం తెల్లవారుజామున భారీ వృక్షం కూలిపోవడంతో రెండు గంటల పాటు అంతర్రాష్ట్ర రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు, గ్రామస్తులు శ్రమించి చెట్టును తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.

దెబ్బతిన్న ఇల్లు

దారకొండ పంచాయతీ జగ్గంపల్లిలో లక్ష్మణరావు అనే గిరిజనుడి ఇంటిపై పక్కనే ఉన్న మట్టిపెళ్లలు విరిగిపడటంతో ఇల్లు పాక్షికంగా దెబ్బతింది. ప్రమాదాన్ని గమనించిన కుటుంబసభ్యులు బయటకు పరుగులు తీయడంతో ప్రాణనష్టం తప్పింది.

పొంగిన కాలువ : గాలికొండ పంచాయతీ పరిధిలోని బత్తునూరు కాలువ వర్షాలకు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో లేతమర్రి, మైనకోట, బుగ్గిరాయి, పాత్రునుగుంట తదితర గ్రామాల ప్రజలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి, శనివారం సప్పర్ల సంతకు కూడా రాలేని పరిస్థితి ఏర్పడింది. కాలువపై వంతెన నిర్మించకపోవడంతో అత్యవసర వైద్యం, నిత్యవసర సరుకుల కోసం ప్రమాదకర స్థితిలోనే వాగు దాటాల్సి వస్తోందని గిరిజనులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పెదబయలు మండలంలో ప్రాణాలకు తెగించి కించూరు గెడ్డను దాటుతున్న ఉపాధి కూలీలు

ఆంధ్రా–ఒడిశా సరిహద్దులోభారీ వర్షాలు

కొట్టుకుపోయిన తాత్కాలిక వంతెనలు

నిలిచిన రాకపోకలు

వాహనదారుల ఇబ్బందులు

కూలిన పూరిల్లు

చింతపల్లి: మండలంలోని లంబసింగి పంచాయతీ పరిధిలోని చిట్టంగరువు గ్రామంలో రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొర్రా లక్ష్మణరావు అనే గిరిజనుడి పూరిల్లు పూర్తిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇంటో ఉన్న నిత్యావసర వస్తువులు పాడవడంతో పాటు రెండు మేకలు మృతి చెందాయి. రెక్కాడితే గానీ డొక్కాడని తమ కుటుంబం తీవ్రంగా నష్టపోవడంతో లక్ష్మణరావు కన్నీరుమున్నీరయ్యారు. బాధిత కుటుంబాన్ని మాజీ సర్పంచ్‌ కొర్రా రఘునాథ్‌, వైఎస్సార్‌సీపీ నాయకులు నూకరాజు, దేపూరి గిరి తదితరులు పరామర్శించి, ప్రభుత్వం తరఫున తగిన సాయం అందేలా చూస్తామని భరోసానిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement