పాడేరు రూరల్: విద్యుత్ బస్సుల పేరుతో కూటమి ప్రభుత్వం పినాకిల్ సంస్థకు ఆర్టీసీ సేవలను కట్టబెట్టే ప్రయత్నాన్ని విరమించుకోవాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు.శనివారం సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పాడేరు ఆర్టీసీ డిపో వద్ద కార్మికులను కలిసి కరపత్రాలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తూ ఆర్టీసీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ఇప్పటికే రాష్ట్రంలో నాలుగు డిపోలను ఖాళీ చేయించిందని, మరో ఎనిమిది డిపోలను ఖాళీ చేయడానికి సిద్ధమవుతోందని తెలిపారు. తొలి దశలో 750 విద్యుత్ బస్సులను ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తున్నారని, మరో 300 బస్సులను కూడా అప్పగించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారని పేర్కొన్నారు. ఈ విద్యుత్ బస్సుల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం ఒక్కో బస్సుకు రూ.40 లక్షల చొప్పున సబ్సిడీ అందిస్తోందని తెలిపారు. భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులను పూర్తిగా తొలగించి, ప్రైవేటీకరణను ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోందని విమర్శించారు. ఆర్టీసీని నష్టాల్లోకి నెట్టేందుకే అక్రమ ఒప్పందాలు కుదుర్చుకుంటోందని ఆరోపించారు. అలాగే, ’సీ్త్ర శక్తి’ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించాల్సిన రూ.1,680 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వానికి నిజంగా కార్మికులపై చిత్తశుద్ధి ఉంటే ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 12 వేల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. పాడేరు డిపోలో ప్రస్తుతం 45 బస్సులు మాత్రమే ఉన్నాయని, కొత్త బస్సులను కొనుగోలు చేసి మారుమూల గ్రామాలకు మరిన్ని రవాణా సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకుడు సుందర్‌రావుతో పాటు కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి
ఉమామహేశ్వరరావు


