అల్లిపురం: విశాఖ కేంద్రంగా పనిచేస్తున్న డెట్ రికవరీ ట్రిబ్యునల్ (డీఆర్‌టీ)లో శనివారం ప్రత్యేక జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మంజూరు చేసిన రుణాల వసూళ్లకు సంబంధించిన వివాదాలను వేగవంతంగా, చట్టబద్ధంగా పరిష్కరించేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు. డీఆర్‌టీ న్యాయమూర్తి కృష్ణ గోపాల్ ద్వివేది ఆధ్వర్యంలో, సభ్యులు ఏ. శ్రీనివాస్, కొండా వేదవతి పర్యవేక్షణలోని ప్రత్యేక బెంచ్ ద్వారా సుమారు రూ. 46 కోట్ల మేర రుణ బకాయిలను రాజీ మార్గంలో పరిష్కరించి వసూలు చేసినట్లు న్యాయమూర్తి తెలిపారు. అనంతరం డీఆర్‌టీ కోర్టు ఆవరణలో మీడియాతో న్యాయమూర్తి కృష్ణ గోపాల్ ద్వివేది మాట్లాడుతూ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, రుణగ్రహీతలు పరస్పర అంగీకారంతో వివాదాలను పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ ఒక మంచి వేదిక. దీనివల్ల ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సమయం, ఆర్థిక భారం ఆదా అవుతాయని పేర్కొన్నారు. ప్రముఖ న్యాయవాది కొండా వేదవతి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు ఏకై క డీఆర్‌టీ కోర్టు విశాఖలోనే ఉందని తెలిపారు. ఇప్పటివరకు నిర్వహించిన లోక్ అదాలత్‌ల ద్వారా సుమారు రూ. 225 కోట్ల మేర బకాయిలు వసూలయ్యాయని ఆమె వివరించారు. డీఆర్‌టీ రిజిస్ట్రార్ పీసీ థామస్ మాట్లాడుతూ రుణగ్రహీతల ప్రయోజనార్థం మున్ముందు కూడా ఇటువంటి ప్రత్యేక లోక్ అదాలత్‌లను విస్తృతంగా నిర్వహిస్తామన్నారు. రుణగ్రహీతలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ రుణ వివాదాలను సునాయాసంగా పరిష్కరించుకోవాలని ఆయన కోరారు.
రూ. 46 కోట్ల రుణ బకాయిల పరిష్కారం


