● పాడేరులో 18 మంది వ్యాపారులపై కేసు
● తూకం యంత్రాలను సీజ్ చేసినలీగల్ మెట్రాలజీ అధికారులు
● రూ.40 వేల అపరాధ రుసుం వసూలు
సాక్షి, పాడేరు: జిల్లా కేంద్రం పాడేరులోని వ్యాపార దుకాణాల్లో తూనికలు, కొలతల్లో మోసాల ఫిర్యాదులతో ఉమ్మడి విశాఖ జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారుల బృందం శనివారం సాయంత్రం మెరుపుదాడులు నిర్వహించింది. మెయిన్‌రోడ్డు, సినిమా హాల్ సెంటర్‌లోని కిరాణా, కూరగాయలు, సిమెంట్, ఐరన్ తదితర దుకాణాల్లో రాత్రి వరకు తనిఖీలు కొనసాగాయి.వినాయక చవితి పండగ సామగ్రి అమ్మకాలతో బిజీగా ఉన్న కిరాణా దుకాణాల్లోకి అనకాపల్లి, పాడేరు లీగల్ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్లు పద్మావతి, అనురాధ తమ సిబ్బందితో కలిసి వెళ్లి తనిఖీలు చేపట్టారు. తూకం యంత్రాలను పరిశీలించడంతో పాటు వాటి సీళ్లు, తూకాల్లో తేడాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్యాకింగ్ చేసిన సామగ్రిని కూడా తూకం వేశారు. పలు దుకాణాల్లో తూకాల్లో తేడాలను గుర్తించిన అధికారులు సంబంధిత వ్యాపారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు తూకాలతో వినియోగదారులను మోసం చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. తప్పుడు తూకం యంత్రాలు, ఇతర అక్రమాలను గుర్తించిన అధికారులు 18 మంది వ్యాపారులపై కేసులు నమోదు చేసి, ఆయా తూకం యంత్రాలను సీజ్ చేశారు. వ్యాపారుల నుంచి రూ.40 వేల అపరాధ రుసుము వసూలు చేశారు. వ్యాపారులంతా నాణ్యమైన తూనికలు, కొలతలను ఉపయోగించి వ్యాపారాలు నిర్వహించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఇన్‌స్పెక్టర్లు హెచ్చరించారు. ఈ తనిఖీల్లో సిబ్బంది శ్రీనివాస్, రమేష్ పాల్గొన్నారు.


