పింఛన్‌పై ఆశ
సీలేరు: మారుమూల గ్రామాల్లో పింఛన్ల దరఖాస్తు ప్రక్రియ గిరిజనులకు తీవ్ర పరీక్షగా మారింది. గత 27 నెలలుగా పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు దరఖాస్తు చేసుకునేందుకు సచివాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. ఈ నెల 16తో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగుస్తుండటం, మధ్యలో శని, ఆది, సోమవారాలు సెలవులు కావడంతో లబ్ధిదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
అడుగడుగునా సాంకేతిక ఆటంకాలు
ఏజెన్సీలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల నెట్‌వర్క్ వ్యవస్థ దెబ్బతిని, సచివాలయాల్లో సర్వర్ ఎర్రర్లు తలెత్తుతున్నాయి. ఒక్కో దరఖాస్తు నమోదుకు 20 నిమిషాలకు పైగా సమయం పడుతోంది. నెట్‌వర్క్ లేక, సచివాలయాలకు వెళ్లాలంటే పది కిలోమీటర్ల మేర ఉప్పొంగే వాగులు, గెడ్డలు దాటాల్సి వస్తోందని గిరిజనులు వాపోతున్నారు.
సదరం సర్టిఫికెట్ లేక..
పుట్టుకతోనే వికలాంగులైన పలువురు బాధితులకు పాడేరు లేదా మైదాన ప్రాంతాలకు వెళ్లి సదరం ధ్రువపత్రం తెచ్చుకునేంత ఆర్థిక, శారీరక శక్తి లేదు. చింతపల్లి క్యాంప్‌కు చెందిన కిలో గణేష్ (13), చంద్రుపల్లికి చెందిన జానకిరామ్ (18), పార్వతీనగర్‌కు చెందిన కుర్ర అజయ్ (12), పరమసింగవరం గ్రామానికి చెందిన పోలియో బాధితుడు రాజులాంటి ఎందరో సదరం ధ్రువపత్రాలు లేక దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు.
● మారుమూల అటవీ ప్రాంతాల్లోని ఈ అభాగ్యులకు ప్రత్యేకాధికారులు స్వయంగా గ్రామాలకు వచ్చి పరిశీలించి ’సదరం’ సర్టిఫికెట్లు మంజూరు చేయాలని స్థానికులు కోరుతున్నారు. అలాగే వర్షాలు, సర్వర్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని పింఛన్ల దరఖాస్తు గడువును పొడిగించాలని గిరిజనులు విజ్ఞప్తి చేస్తున్నారు.
డుంబ్రిగుడలో సర్వర్ ఎర్రర్
డుంబ్రిగుడ: మండల కేంద్రంలోని సచివాలయంలో ప్రభుత్వం అందిస్తున్న వృద్ధాప్య, వికలాంగ, వితంతు, ఒంటరి మహిళా పింఛన్ల ఆన్‌లైన్ ప్రక్రియ కాకపోవడంతో గిరిజనులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు కార్యాలయం మూసివేసే వరకు సచివాలయం చుట్టూ పడికాపులు కాస్తున్నా పనులు కావడం లేదని వాపోతున్నారు. సర్వర్ ఎర్రర్ కారణంతో సచివాలయ సిబ్బంది ఆన్‌లైన్ ప్రక్రియను పక్కనబెట్టేశారని గిరిజనులు ఆరోపిస్తున్నారు. శని, ఆది, సోమవారాలు వరుస సెలవు దినాలు కావడంతో పింఛన్ల దరఖాస్తుకు నిర్ణయించిన గడువు తేదీ దాటిపోతుందని దరఖాస్తుదారులు తీవ్ర దిగులు చెందుతున్నారు. తహసీల్దార్ కార్యాలయంలో పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునే వారికి కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తక్షణమే అందిస్తున్నప్పటికీ, సచివాలయంలో ఆన్‌లైన్ చేయకపోవడంపై పలువురు మండిపడుతున్నారు.
వందల సంఖ్యలో పెండింగ్
సిబ్బంది కొరతతో పాటు వెబ్‌సైట్ ఎర్రర్ వల్ల సచివాలయంలో వందలాది దరఖాస్తులు మూలనపడి ఉన్నాయని, మంగళవారంతో గడువు ముగిస్తే తమకు పింఛన్ రాదేమోనని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా పంచాయతీ కార్యదర్శులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, సచివాలయ సిబ్బంది స్పందించి, గిరిజనుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సాకులు చెప్పకుండా పింఛన్ల దరఖాస్తులను త్వరగా ఆన్‌లైన్ చేయాలని కోరుతున్నారు.
దరఖాస్తు గడువు పెంచాలి:
గిరిజన సంఘం డిమాండ్
చింతపల్లి: మండలంలో కొత్తగా పింఛన్లకు దరఖాస్తు చేసుకునే లబ్ధిదారులకు గడువు పొడిగించాలని మండల గిరిజన సంఘం కార్యదర్శి సాగిన చిరంజీవి డిమాండ్ చేశారు. శుక్రవారం చౌడుపల్లి పంచాయతీ పరిధిలోని సచివాలయం–2లో పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి వచ్చిన లబ్ధిదారులతో కలిసి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కొత్త పింఛన్ల కోసం వేలాది మంది అర్హులు ఎదురుచూస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ఉన్నపళంగా వృద్ధాప్య, వితంతు, వికలాంగ పింఛన్ల దరఖాస్తులకు కేవలం 7 రోజులే గడువు ఇవ్వడం అన్యాయమన్నారు.
ప్రభుత్వం ప్రకటించిన 7 రోజుల గడువులో 3 రోజులు సెలవులే రావడం వల్ల అర్హులైన వారు దరఖాస్తు చేసుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పింఛన్ల దరఖాస్తుకు పలు రకాల ధ్రువీకరణ పత్రాలు అవసరం కావడంతో వాటిని సమకూర్చుకోవడానికే సమయం సరిపోవడం లేదన్నారు. స్వల్ప వ్యవధి విధించడం వల్ల ఎంతో మంది అర్హులు పింఛన్లకు దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు. లబ్ధిదారుల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని దరఖాస్తుల స్వీకరణ గడువును ఈ నెలాఖరు వరకు పొడిగించేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీసా కమిటీ ఉపాధ్యక్షుడు లోచలి రాజారావు, చిన్నాలదొర, లక్ష్మణరావు, మల్లుపడాల్, లక్ష్మయ్య పాల్గొన్నారు.
చౌడుపల్లిలో పేదలతో కలిసి ఆందోళన చేస్తున్న గిరిజన సంఘం కార్యదర్శి చిరంజీవి
ముంచంగిపుట్టు మండలం లక్ష్మీపురంలో మాట్లాడుతున్న మాజీ సర్పంచ్ త్రినాథ్
దరఖాస్తు చేసుకునేందుకుసాంకేతిక ఇబ్బందులు
గడువు ముగుస్తుండటంతోఆందోళన


