సాక్షి, పాడేరు: వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రజలంతా బాధ్యతగా మట్టి గణపతి విగ్రహాలనే పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ పిలుపునిచ్చారు. కలెక్టరేట్‌లో శుక్రవారం రాత్రి అధికారులు, సిబ్బందికి ఆమె మట్టి వినాయక విగ్రహాలను అందజేసి, ముందస్తు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసిన విగ్రహాల వినియోగానికి ప్రజలు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు.ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేయడం వల్ల నదులు, చెరువులు, ఇతర జలవనరులు తీవ్రంగా కలుషితమవుతాయని.. దీనివల్ల జలచరాలకు, పర్యావరణానికి ఎంతో హాని జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఇంట్లో, ప్రతి మండపంలోనూ మట్టి గణపతులను ప్రతిష్టించి పర్యావరణహితంగా పండుగను జరుపుకోవాలన్నారు. పిల్లల్లో సృజనాత్మకత పెంపొందించేలా వారితోనే సొంతంగా మట్టి విగ్రహాలను తయారు చేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎంవీఎస్ లోకేశ్వరరావు, కలెక్టరేట్ ఏవో, సూపరింటెండెంట్లు, వివిధ సెక్షన్ల సిబ్బంది పాల్గొన్నారు.
జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ


