● విస్తారంగా వానలు
● ప్రాణం పోసుకుంటున్న ఖరీఫ్ పంటలు
● గిరి రైతుల్లో ఆనందం
సాక్షి, పాడేరు: జిల్లాలో గత రెండు రోజులుగా మన్యంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో కొండవాగులు, గెడ్డల్లో వరద నీటి ప్రవాహం గణనీయంగా పెరిగింది. మరికొన్ని చోట్ల మోస్తరు వర్షం కురిసింది. పాడేరు, హుకుంపేట, డుంబ్రిగుడ, అరకులోయ ప్రాంతాల్లో గురువారం రాత్రంతా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది.
సంతలపై ప్రభావం..
పాడేరు పట్టణ పరిధిలో శుక్రవారం ఉదయం 9 గంటల తర్వాత వర్షం తగ్గడంతో వారపు సంతకు వచ్చే ప్రజలకు, వ్యాపారులకు పెద్దగా ఇబ్బంది తప్పింది. అయితే మిగిలిన ప్రాంతాల్లో వర్షం కొనసాగడంతో అరకు వారపు సంతలో చిరువ్యాపారులు, గిరిజనులు తీవ్ర అవస్థలు పడ్డారు.
రైతన్నల ఆనందం
సాగునీరు అందక ఎండిపోయే దశకు చేరుకున్న ఖరీఫ్ వ్యవసాయ భూములకు ఈ వర్షాలు ఎంతో మేలు చేశాయని గిరిజన రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో 197.6 ఎంఎం వర్షపాతం
జిల్లాలో హుకుంపేటలో 31.8 మిల్లీమీటర్లు, పాడేరులో 29.6, ముంచంగిపుట్టులో 22.6, చింతపల్లిలో 22.2, డుంబ్రిగుడలో 16.4, జి.మాడుగులలో 16.4, అరకులోయలో 15.2, పెదబయలులో 12.8, అనంతగిరిలో 7.2, కొయ్యూరులో 7 మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది.
సీలేరు: ఆంధ్రా–ఒడిశా సరిహద్దు అటవీ ప్రాంతాల్లో గురువారం సాయంత్రం 4 గంటల నుంచి భారీ వర్షం కురుస్తోంది.రోడ్లన్నీ జలమయమయ్యాయి. దారకొండ దారాలమ్మ ఘాట్ రోడ్డుపై వర్షం కారణంగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అంతర్రాష్ట్ర రహదారిపై సీలేరు సమీపంలోని ఎర్రదెబ్బల వద్ద రోడ్డుపై భారీ వృక్షం కూలిపోవడంతో ఇరువైపులా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. సీలేరు ప్రధాన రహదారి అంతటా వర్షపు నీరు ప్రవహిస్తోంది. వర్షం తీవ్రతకు మారుమూల ప్రాంతాల్లోని వ్యాపార సముదాయాలు, దుకాణాలు మూతపడ్డాయి. మాదిగమల్లు, పిల్లిగెడ్డ, చిన్నగంగవరం, వలసగెడ్డ వాగులు పొంగిపొర్లుతున్నాయి.గిరిజనుల పంట పొలాల్లోకి నీరు చేరడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.


