డుంబ్రిగుడ: మండలంలోని గసభ పంచాయతీ కూడ రెవెన్యూ గ్రామంలో నూతన రేషన్ డిపోను ఏర్పాటు చేయాలని కోరుతూ స్థానిక రేషన్ కార్డుదారులు శుక్రవారం పాడేరులో జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా గసభ పంచాయతీ మాజీ సర్పంచ్ పాంగి సురేష్‌కుమార్‌తో పాటు 5 గ్రామాల ప్రజలు మాట్లాడుతూ.. తమ ప్రాంతవాసులు రేషన్ బియ్యం కోసం సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న లోగిలి డిపోకు వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నడవలేని వృద్ధులు, గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా రని, ప్రజలకు అందుబాటులో ఉండేలా కూడ గ్రామంలో వెంటనే రేషన్ డిపోను ఏర్పాటు చేయాలని కోరా రు. స్థానికుల వినతిపై జాయింట్ కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. రేషన్ డిపోతో పాటు అర్హులైన గిరిజనులకు పోడు పట్టాలు మంజూరు చేయాలని కూడా అధికారులకు వినతిపత్రం అందజేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ వార్డు మెంబర్ పాంగి గోపాల్, గెమ్మెలి రామన్న, మర్రి రామన్న, కొర్రా రాజారావు, గెమ్మెలి రఘునాథ్, హరిబాబు, బొంజుబాబు తదితరులు పాల్గొన్నారు.


