మంత్రి గుమ్మడి సంధ్యారాణి, కలెక్టర్ నిశాంతి
అరకులోయ టౌన్(డుంబ్రిగుడ): గిరిజనుల ప్రత్యేక గుర్తింపు, సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షిస్తూ సమగ్ర అభివృద్ధి సాధించడమే లక్ష్యమని జిల్లా ఇన్‌చార్జి, గిరిజన సంక్షేమ, సీ్త్రశిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, కలెక్టర్ టి.నిశాంతి తెలిపారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో సోమవారం నిర్వహించారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, జీవన విధానాలను ప్రతిబింబించే సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఆదివాసీలు ఏ రంగంలోనూ ఎవరికీ తక్కువ కాదని, అన్ని రంగాల్లోనూ ముందుకు వెళ్లే సామర్థ్యం వారికి ఉందన్నారు. ఆదివాసీల హక్కులు, గౌరవం, సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మారుమూల ప్రాంతాల నుంచి పీజీఆర్‌ఎస్‌కు వచ్చే ప్రజలకు ప్రతి శుక్రవారం ఉచిత పోషకాహార భోజనం అందించే ఫుడ్ ఇన్ పీజీఆర్‌ఎస్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ఖేత్‌బచావ్ అభియాన్–రుణ మేళాల ద్వారా 11 మండలాల్లో 130 మేళాలు నిర్వహిస్తున్నామని, గ్రామస్థాయిలోనే రుణ ప్రక్రియను సులభతరం చేస్తున్నామని చెప్పారు. గిరిజన యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగాలు, స్వయం ఉపాధి, పారిశ్రామిక అవకాశాల కోసం ఏఎస్‌ఆర్ లక్ష్యం–జిల్లా ఉపాధి సెల్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. గిరిజన మహిళల ఆర్థిక సాధికారతలో భాగంగా జిల్లాలో మహిళలకు రూ.24.23 కోట్ల ఆర్థిక సాయం అందించామని తెలిపారు. 11 పైలెట్ పీహెచ్‌సీల్లో 1,427 మంది గర్భిణులను డిజిటల్‌గా ట్రాక్ చేస్తున్నామని ఏప్రిల్,జూలై నెలల మధ్య పైలట్ పీహెచ్‌సీల్లో మాతృ మరణాలు నమోదు కాలేదని తెలిపారు. పీఎం సురక్షిత మాతృత్వ అభియాన్ కింద 5,103 మంది గర్భిణులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించామన్నారు. జలధార–జలహారతి ద్వారా 11 గిరిజన మండలాల్లో రూ.529.64 కోట్లతో 9,386 పనులు చేపట్టామని సుమారు 84.35 కిలోమీటర్ల ఫీడర్ చానళ్లను పునరుద్ధరించామని చెప్పారు. తల్లికి వందనం ద్వారా 1,33,984 మంది విద్యార్థులకు రూ.174.17 కోట్ల ప్రయోజనం అందించామని తెలిపారు. 13,461 మంది రైతులకు రూ 135.21 కోట్ల రుణాలు అందించామని, 45 కొత్త ఎఫ్‌పీవోలను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా ఇన్‌చార్జి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీపై విమర్శలు చేసేందుకే ఆమె అధిక ప్రాధాన్యం ఇచ్చారు.
ఆదివాసీ వేషధారణలో జిల్లా అధికారులు
కలెక్టర్ నిశాంతి, జాయింట్ కలెక్టర్ శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మతో పాటు జిల్లా అధికారులు సంప్రదాయ ఆదివాసీ దుస్తుల్లో కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సంప్రదాయ నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి.


