రెండు జనరేటర్లతో 34 మెగావాట్ల ఉత్పత్తి
ముంచంగిపుట్టు: ఆంధ్ర,ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణలో ఉన్న మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి మెరుగుపడింది. ఆదివారం తెల్లవారుజాము నుంచి మరో జనరేటర్ వినియోగంలోకి వచ్చింది. ఈ ఏడాది మే నెలలో ప్రాజెక్టులో అగ్నిప్రమాదం సంభవించి, భారీగా ఆస్తి నష్టం జరిగిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ప్రాజెక్టు అధికారులు, సిబ్బంది విద్యుత్ ఉత్పత్తిని తిరిగి గాడిలో పెట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. గత నెల 29న ఒకటో నంబర్ జనరేటర్‌ను వినియోగంలోకి తీసుకువచ్చి విద్యుత్ ఉత్పత్తి పునఃప్రారంభించారు. ఇప్పుడు రెండో నంబర్ జనరేటర్‌ను సైతం వినియోగంలోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం ప్రాజెక్టులో రెండు జనరేటర్ల సాయంతో ప్రతి గంటకు 34 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. మరో రెండు నెలల్లో మిగిలిన నాలుగు జనరేటర్లను వినియోగంలోకి తీసుకువచ్చి శతశాతం విద్యుత్ ఉత్పత్తి జరిగేలా చర్యలు తీసుకుంటామని, నాలుగు జనరేటర్లకు చెందిన ప్రొటెక్షన్ ప్యానెల్ బోర్డులు రావాల్సి ఉందని ప్రాజెక్టు ఎస్‌ఈ సీహెచ్.అప్పాజీ తెలిపారు.


