
నిలిచిపోయిన అంతర్రాష్ట్ర వాహనాలు
ఎటపాక: మండలంలోని రాయనపేట వద్ద జాతీయ రహదారిపైకి గురువారం ఉదయం నుంచి వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అంతర్రాష్ట్ర వాహనాలను సైతం రాష్ట్ర సరిహద్దుల్లో నిలిపివేశారు.
● నెల్లిపాక నుంచి కూనవరం వెళ్లే రహదారిపై నెల్లిపాక, గౌరిదేవిపేట, నందిగామ, మురుమూరు వద్ద రహదారిని వరద ముంచేసింది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు బందయ్యాయి.
● తోటపల్లి, నందిగామ, మురుమూరు సమీపంలో జామాయిల తోటలు నీటమునిగాయి. గౌరిదేవిపేట పీహెచ్‌సీ పరిధిలోని పది గ్రామాల్లో గర్భిణులను, నెల్లిపాక పీహెచ్‌సీ పరిధిలోని ఇద్దరిని ముందు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
● గొల్లగూడెం గ్రామంలోని తొమ్మది కుటుంబాలను సీతాపురంలోని పునరావాస కేంద్రానికి తరలించారు. మండలంలోని వరద ముంపు ప్రాంతాల్లో ప్రత్యేక అధికారి బాలకృష్ణారెడ్డితో పాటు, తహసీల్దార్ సుబ్బారావు, ఎంపీడీవో ప్రేమ్‌సాగర్ పర్యటించి వరద పరిస్థితిని పరిశీలించారు.
● ఎగువున ఉన్న సమ్మక్క సారక్క బ్యారేజి వద్ద గోదావరి వరద ప్రవాహం నిలకడగా మారడంతో దిగువ ప్రాంత వాసులు ప్రస్తుతానికి ఊపిరి పీల్చుకుంటున్నారు.