
పఠనా సామర్థ్యం పెంచండి
● కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశం
● రాజవొమ్మంగి గిరిజన బాలికల గురుకుల పాఠశాల తనిఖీ
రాజవొమ్మంగి: స్థానిక గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో పిల్లల పఠనా సామర్థ్యం సరిగ్గా లేదంటూ కలెక్టర్ దినేష్‌కుమార్ అసహనం వ్యక్తం చేశారు. శుక్రవారం రాత్రి ఆయన ఈ విద్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. పిల్లల సామర్థ్యాన్ని పరిశీలించారు. పాఠ్యాంశాలు ఎందుకు సరిగ్గా చదవలేకపోతున్నారని ప్రిన్సిపాల్ సత్యవేణి, క్లాచ్ టీచర్‌ను ప్రశ్నించారు. వారి తీరులో మూడు నెలల్లో మార్పు తీసుకురావాలని ఆదేశించారు. చదువులో వెనుకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపి ప్రతిభావంతులుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికపరంగా చర్యలు చేపట్టాలని సూచించారు. విద్యార్థినులందరూ సమయస్ఫూర్తితోపాటు యాక్టివ్‌గా ఉన్నారన్నారు. వారికి మంచి విద్యాబుద్దులు చెప్పి మరింతగా తీర్చిదిద్దాల్సిఉందని, ఇందుకు మనమే సరియైన కృషి చేయలేకపోతున్నామన్నారు. పిల్లలు ఆరోగ్యంగా కనిపించడ ంలేదన్నారు.
ప్రత్యేక ఆహారం ఇవ్వండి
వార్డెన్‌ను పిలిపించి మెనూ వివరాలు తెలుసుకున్నారు. పాఠశాలలో 6 నుంచి టెన్త్ వరకు సుమారు 485 మంది వుండగా వీరిలో 32 మంది రక్తహీనతతో ఉండటంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వీరికి ప్రత్యేక ఆహారం ఇవ్వాలని కోరారు. వీరికి ఐరన్ ఫోలిక్ మాత్రలు ఇస్తున్నారా అని సిబ్బందిని ప్రశ్నించారు. అవి ఏ రంగులో ఉంటాయన్న ప్రశ్నకు జవాబు ఇవ్వకపోవడంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పలుసార్లు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడాన్ని గుర్తించిన ఆయన ఇలాగైతే పిల్లల చదువులు ఎలా సాగుతాయన్నారు. ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. పాఠ్యాంశాల బోధనపై ప్రణాళికలను తెలుసుకున్నారు. ఏఒక్కరు సమాధానం చెప్పకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. ఇదే పాఠశాలకు చెందిన విద్యార్థిని గత మే నెలలో అనారోగ్యంపై చనిపోవడంపై సమగ్ర విచారణ జరపాలని ఏటీడబ్ల్యూవో కృష్ణమోహన్‌ను ఆదేశించారు.
కలెక్టర్ దృష్టికి తాగునీటి సమస్య
స్థానిక ఏకలవ్య పాఠశాలను కూడా కలెక్టర్ తనిఖీ చేశారు. తాగునీటి సమస్యను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ఏకలవ్య పాఠశాలకు చుట్టూ ప్రహరీ లేకపోవడంతో స్థలం అన్యాక్రాంతం అవుతోందని ఎంపీటీసీ పెద్దిరాజు కలెక్టర్‌కు వివరించారు. డ్రైనేజీ సదుపాయం కూడా లేదని ఆయన వివరించారు. జాతీయ రహదారిపై లైట్లు వెలగడం లేదని స్థానికులు కలెక్టర్‌కు విన్నవించారు. పశువులు అధికశాతం రోడ్లపైనే ఉంటున్నందున ప్రమాదాలు జరుగుతున్నాయని కలెక్టర్‌కు చెప్పారు. వెంటనే పశువుల యజమానులతో సమావేశం ఏర్పాటు చేసి, రోడ్లపై విడిచిపెడుతున్న పశువులకు సంబంధించిన యజమానులను ఫైన్ విధించాలని ఎస్‌ఐ నర్సింహమూర్తిని ఆదేశించారు. ఆయన వెంట ఎంఈవోలు సత్యన్నారాయణదొర, సూరయ్యరెడ్డి, తహసీల్దార్ సత్యనారాయణ ఉన్నారు.